ఎన్నికల వేళ తెలంగాణలో సోనియా కొత్త అస్త్రం..!!
తెలంగాణ ఎన్నికలకు కాంగ్రెస్ నాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కర్ణాటక ఎన్నికల్లో గెలుపు తరువాత తెలంగాణ పైన ఫోకస్ చేసింది. ప్రస్తుతం సీడబ్ల్యూసీ సమావేశాలను సైతం హైదరాబాద్ వేదికగా నిర్వహించటం ద్వారా తెలంగాణ ఎన్నికలకు ఇస్తున్న ప్రాధాన్యత స్పష్టం చేస్తోంది. ఇదే సమయంలో ఎన్నికల వేళ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసిన సోనియా గాంధీ..ఇప్పుడు రాష్ట్రం ఇచ్చిన పార్టీగా మరో ఆరు గ్యారంటీ స్కీంలతో ప్రజల మధ్యకు వస్తున్నారు.
ఆరు గ్యారంటీ స్కీంలు
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమలు చేసే స్కీంలను ప్రకటించేందుకు కాంగ్రెస్ సిద్దమైంది. బహిరంగ సభలో సోనియా తెలంగాణ ప్రజల కోసం ఆరు గ్యారంటీ స్కీంలను ప్రకటించ నున్నారు. అందులో 1. రూ.500లకే వంటగ్యాస్ సిలిండర్. 2. ఏక కాలంలో రెండు లక్షల రైతు రుణమాఫీ. 3. రెండు లక్షల ప్రభుత్వ ఉధ్యోగాల భర్తీ.4. దలిత, గిరిజనులకు 12 లక్షల ఆర్థిక సహాయం.
5. ఇందిరమ్మ ఇళ్ళకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం. 6. మహిళా సాధికారతకు ప్రత్యేక నిధి...వంటివి ఉన్నాయి. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లో అమలు చేసిన గ్యారంటీ స్కీంలకు వచ్చిన ప్రజాదరణ ఫార్ములా ను తెలంగాణలోనూ అమలు చేయాలని పార్టీ నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ నేతలకు సోనియా దిశా నిర్దేశం చేసారు.

క్రమశిక్షణ పాటించాలి
సీడబ్ల్యూసీ సమావేశాల్లో తొలి రోజున 14 అంశాలపై తీర్మానం చేసిన నేతలు..రెండో రోజు సమావేశంలో పలు అంశాల పైన చర్చించారు. ఈ సమావేశంలో పీసీసీ..సీఎల్పీ నేతలు పాల్గొన్నారు. పార్టీలో క్రమశిక్షణను పాటించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించారు. సొంత పార్టీ నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దన్నారు. పార్టీ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఎవరూ వ్యవహరించకూడదని స్పష్టం చేసారు. ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిపై రివ్యూ చేస్తూనే... 5 రాష్ట్రాల పీసీసీ అధ్యక్షుల నుంచి నివేదిక కోరారు. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో ఏఐసీసీ నేతల ప్రచారంపై త్వరలోనే షెడ్యూల్ ప్రకటిస్తామని ఖర్గే వెల్లడించారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడమే ఈ సమావేశం ఎజెండాగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పేర్కొన్నారు.

సోనియా ప్రసంగం పై ఉత్కంఠ
బీఆర్‌ఎస్, ఎంఐఎం బీజేపీకి పరోక్ష మద్దతుదారులని టీపీసీసీ చీఫ్ రేవంత్ ఆరోపించారు. సాయంత్రం జరిగే విజయభేరిలో సోనియాగాంధీ గ్యారంటీలను ప్రకటిస్తారని వెల్లడించారు. బోయిన్ పల్లి రాజీవ్ గాంధీ నాలెడ్జ్ సెంటర్‌కు సభలోనే శంఖుస్థాపన చేస్తారని చెప్పారు. తెలంగాణ ఇస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్టే.. ఇవాళ విజయభేరిలో ఇవ్వబోయే గ్యారంటీలను కాంగ్రెస్ అమలు చేస్తుందని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లో పథకాలు అన్నీ అమలు చేసేలా గ్యారెంటీ ఇవ్వబోతున్నామని వెల్లడించారు. బహిరంగ సభలో కేసీఆర్ ప్రభుత్వం పైన సోనియా ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారనేది రాజకీయంగా చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications