తెలంగాణా, ఏపీ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త!
దక్షిణ మధ్య రైల్వే దక్షిణ భారత దేశంలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి, బెస్ట్ రైల్వే సేవలు అందించడానికి తనవంతుగా కృషి చేస్తోంది. వివిధ ప్రాంతాలలో ప్రయాణికుల అధిక డిమాండ్ ఉన్నచోట, అదనపు రద్దీని తగ్గించేందుకు ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. గతంతో పోలిస్తే దేశవ్యాప్తంగా రైల్వే సేవలు మరింత మెరుగ్గా అందుతున్నాయి.
దక్షిణ మధ్య రైల్వే శుభవార్త
దక్షిణ భారత దేశంలోనూ దక్షిణ మధ్య రైల్వే సమయానికి తగ్గట్టు, ప్రయాణికుల అవసరానికి తగ్గట్టు, వివిధ సందర్భాలకు తగ్గట్టు రైలు సేవలను అందిస్తోంది. తాజాగా హైదరాబాద్ మంగళూరు మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్ల సర్వీసులపైన దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ప్రయాణికుల సౌకర్యం కోసం ఈ రైళ్లను పొడిగిస్తున్నట్లు తెలిపింది.

హైదరాబాద్ మంగళూరు మధ్య నడుస్తున్న స్పెషల్ ట్రైన్ పొడిగింపు
సాధారణంగా వేసవికాలంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నడిపిన ప్రత్యేక రైళ్లకు ప్రయాణికుల నుంచి అసాధారణమైన స్పందన రావడంతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మంగళూరు మధ్య నడుస్తున్న స్పెషల్ ట్రైన్ మరో ఐదు ట్రిప్పుల పాటు పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది.
ప్రయాణికుల రద్దీతో నిర్ణయం
వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు రద్దీ సమయంలో రవాణా ఇబ్బందులు తొలగిపోయేలా స్పెషల్ ట్రైన్స్ సేవలు పొడిగిస్తున్నట్టు చెప్పింది . హైదరాబాద్ నుండి మంగళూరుకు నడిచే ట్రైన్ నెంబర్ 07097 జూలైలో బుధవారాల్లో నడుస్తుంది. జూలై మాసంలో 1,8, 15, 22 తేదీలలో నడిచిన ఈ ట్రైన్ 29వ తేదీన కూడా సేవలు అందించనుంది.
తెలంగాణ నుంచి కర్ణాటక, కేరళ వైపు ప్రయాణించే వారికి ఉపయోగం
తిరుగు ప్రయాణానికి సంబంధించి ట్రైన్ నెంబర్ 07098 మంగళూరు నుంచి హైదరాబాద్ కు గురువారం నడుస్తుంది. ఈ ట్రైన్ ఇప్పటికే జూలై 2, 9, 16, 23తేదీలలో నడిచింది. ఇప్పుడు 30వ తేదీన కూడా ట్రిప్ నిర్వహిస్తుంది. ప్రత్యేకరైళ్లు తెలంగాణ నుంచి కర్ణాటక, కేరళ వైపు ప్రయాణించే వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మార్గాలలో ప్రయాణం చేసేవారు సాధారణ రైళ్లలో సీట్లు దొరక్కపోతే ఈ సర్వీసుల ద్వారా ప్రయాణం చేయవచ్చు.
ఈ ముఖ్యమైన స్టేషన్ లలో ఆగనున్న ప్రత్యేక రైళ్ళు
అయితే రైల్వే అధికారులు ప్రయాణికులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ ప్రత్యేక రైళ్లు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలలోని పలు స్టేషన్లలో ఆగుతాయి. బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, గుంతకల్, అనంతపురం, యలహంక, కృష్ణ రాజపురం, సేలం, పాలక్కాడ్, కోళి కోడ్, వడకర, కాసర్గోడ్ తదితర ముఖ్యమైన స్టేషన్లలో ఈ స్పెషల్ ట్రైన్ ఆగుతుందని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కూడా ప్రయాణికుల డిమాండ్ ను బట్టి ఈ ప్రత్యేక రైళ్లను కొనసాగించే అవకాశం ఉందని సమాచారం.












Click it and Unblock the Notifications