ఆదర్శమూర్తి శ్రీరాముడు: గవర్నర్ తమిళి సై, సీఎం కేసీఆర్ శ్రీరామనవమి శుభాకాంక్షలు!!
నేడు శ్రీరామనవమి. ఆదర్శమూర్తి అయిన శ్రీరాముని ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. వాడవాడలా సీతారామ కళ్యాణాన్ని జరిపించి లోక కళ్యాణం కోసం ఆ రామయ్యను ప్రార్థిస్తారు. భద్రాచలంలో శ్రీ సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది.
నేడు శ్రీరామ నవమి సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ధర్మమూర్తి శ్రీరాముడి జీవన విధానం నుంచి ప్రజలంతా తరతరాలుగా ప్రేరణ పొందుతున్నారని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కూడా రాష్ట్ర, దేశ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు.

అన్యోన్య దాంపత్య జీవనానికి మారుపేరు అయిన సీతారాములను ఆరాధ్య దైవాలుగా, ఇలవేల్పుగా హిందువులంతా కొలుస్తారని తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడించారు. కుటుంబ జీవనానికి శ్రీ సీతారామ చంద్రులు ఆదర్శమూర్తులని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కుటుంబ విలువలు క్షీణిస్తున్న వర్తమాన కాలంలో సీతారాముల ఆశయాలను విలువలను ఆదర్శవంతమైన కుటుంబ జీవనాన్ని కొనసాగించడానికి శ్రీరామనవమి పండుగ ఒక ప్రత్యేక సందర్భమని కెసిఆర్ పేర్కొన్నారు.
వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి నాడు ఆదర్శ దంపతులైన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా, దేశవ్యాప్తంగా వాడ వాడలా ప్రతి ఒక్కరు నిర్వహించుకోవడం ఒక విశేషమని సీఎం కేసీఆర్ వెల్లడించారు. శ్రీరాముడు ఎన్ని కష్టాలు ఎదురైనా తాను నమ్మిన సత్య శీలత, ధర్మ నిరతి ఆచరించి చూపారని కెసిఆర్ పేర్కొన్నారు. ప్రతి ఏడాది తరహాలోనే ఈ సంవత్సరం కూడా భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వ అధికారికంగా నిర్వహిస్తుందని వెల్లడించారు.
శ్రీరామచంద్రుడు ఇంటికి పెద్ద కొడుకుగా కుటుంబ బాధ్యతలకు, కట్టుబాట్లకు అత్యంత విలువని ఇచ్చాడని, తండ్రి మాట కోసం కఠోర త్యాగాలను చేశాడని, అందుకే ఆయన తరతరాలకు ఆదర్శనీయుడయ్యాడని తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఆ శ్రీరామచంద్రమూర్తి కృపాకటాక్షాలతో రాష్ట్రం తో పాటు, యావత్ భారతదేశం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని తాను ఆ భగవంతుడిని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్.












Click it and Unblock the Notifications