భద్రాద్రిలో వైభవంగా సీతారాముల కళ్యాణం: కేసీఆర్ మనుమడి సందడి
భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండవగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు.
కొత్తగూడెం: భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండవగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, సరిహద్దు జిల్లాలు, రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు స్వామి వారి కళ్యాణాన్ని కన్నులారా వీక్షించారు.

కళ్యాణ వైభవం
బుధవారం ఉదయం భద్రాచలంలో సీతారాముల కళ్యాణ వేడుక వైభవంగా ప్రారంభమైంది. కళ్యాణ వేదిక పైకి స్వామి వారు చేరుకున్న అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య కళ్యాణ వేడుక ప్రారంభమైంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అనారోగ్యం కారణంగా ఇక్కడి రాకపోవడంతో.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆ తర్వాత సీఎం మనుమడు హిమాన్షు.. స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

ప్రత్యేక పూజలు
కాగా, భద్రాద్రి రామయ్య కళ్యాణంలో భాగంగా పుణ్యాహవాచన కార్యక్రమం నిర్వహించారు. సుందరంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై ఉంచిన జల కలశానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుణ్యాహవాచనం ముగిసిన అనంతరం కళ్యాణ ఘట్టం ప్రారంభమైంది.

హర్షధ్వానాల మధ్య..
కళ్యాణం కోసం సీతమ్మ వారిని స్వామి వారికి అభిముఖంగా పెళ్లి పీటలపై కూర్చోబెట్టారు. సరిగ్గా మధ్యాహ్నం 12.18 నిమిషాలకు భక్తుల హర్షధ్వానాల మధ్య సీతమ్మకు మాంగల్యధారణ కార్యక్రమాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు.

వేలాది భక్తులు..
అంతకుముందు అమ్మవారికి చింతాకు పతకధారణ చేశారు. ఈ వేడుకకు వేలాదిగా భక్తులు హాజరయ్యారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర మంత్రులు కడియం శ్రీహరి, ఇంద్రకరణ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కోదండ రామస్వామి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ.. సీతారాముల కళ్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు.

వేడుకగా తలంబ్రాలు..
అనంతరం కళ్యాణఘట్టంలో అత్యంత ప్రసిద్ధి చెందిన తలంబ్రాల కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. కళ్యాణ వేడుక నేటితో ముగియగా.. రేపు(గురువారం) పట్టాభిషేకం కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి పట్టాభిషేకం కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్ హాజరు కానున్నారు.












Click it and Unblock the Notifications