వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్‌కు 'మల్లన్న' షాక్: ప్రజలపై లాఠీ, అమరావతిని లాగిన హరీష్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/మెదక్: మల్లన్న సాగర్ ఉద్యమం ఆదివారం నాడు ఉద్రిక్తతకు దారి తీసింది. రెండు ముంపు గ్రామాల్లో అట్టుడికింది. నిర్వాసితుల పైన పోలీసులు లాఠీచార్జ్ చేశారు. గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో, గ్రామస్థులు పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. అడుగడుగునా పోలీసులు ఉన్నారు. 144వ సెక్షన్ విధించారు.

మల్లన్న సాగర్ నిర్వాసితులు.. మెదక్‌ జిల్లా కొండపాక మండలం ఎర్రవల్లిలో వేలసంఖ్యలో గుమిగూడారు. వారికి భారీ సంఖ్యలో పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది.

మల్లన్నసాగర్‌ ముంపు ప్రాంతాలైన కొండపాక మండలం సింగారం, ఎర్రవల్లి, తొగుట మండలం పల్లెపహాడ్‌, వేములఘాట్‌ గ్రామాలకు చెందిన ప్రజలు ఉదయం పదకొండు గంటలకు రాజీవ్‌ రహదారిపైకి రాస్తారోకో చేయడానికి వెళ్తుండగా పల్లెపహాడ్‌ సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో కొందరు యువకులు ఒంటిపై కిరోసిన్‌ పోసుకున్నారు. అక్కడి నుంచి తోసుకుంటూ వచ్చిన ప్రజలు ఎర్రవల్లి వద్ద పెద్దసంఖ్యలో గుమిగూడారు. సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్‌ ఆధ్వర్యంలో పోలీసు బలగాలను రప్పించారు. గ్రామం నుంచి ప్రజలు బయటకు కదలకుండా అడ్డుకుని, లాఠీఛార్జి చేశారు.

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

మల్లన్నసాగర్‌ నిర్వాసితులపై జరిగిన ఘటనపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. రైతులపై పోలీసులతో లాఠీఛార్జీ, కాల్పులు జరిపించడం అమానుషమని తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం మెదక్‌ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చామని తెలిపారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

తెలంగాణలో అమానుష పాలన కొనసాగుతోందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు విమర్శించారు. గ్రామాలను పోలీసులతో నిర్బంధించారని, దళిత మహిళా రైతుల్ని బూట్లతో తన్నారని ఆగ్రహం చెందారు. 26న చలో మల్లన్నసాగర్‌ నిర్వహిస్తున్నామన్నారు.

సిపిఐ, సిపిఎం

సిపిఐ, సిపిఎం

చట్టబద్ధంగా భూములకు నష్ట పరిహారాన్ని ఇప్పించాలని కోరుతున్న మల్లన్నసాగర్‌ భూనిర్వాసితులపై పోలీసులతో లాఠీఛార్జీ చేయించడం అమానుషమని సీపీఐ తెలంగాణ రాష్ట్రకార్యదర్శి చాడ వెంకట రెడ్డి అన్నారు. ప్రజల చట్టబద్ధ హక్కులను అణిచివేసేందుకు రెవెన్యూ, పోలీసు అధికారులను మంత్రి హరీశ్ రావే ఉసిగొల్పుతున్నారని సీపీఎం తెలంగాణ రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు.

బీజేపీ

బీజేపీ

మల్లన్నసాగర్‌ భూ నిర్వాసితులపై రాష్ట్రప్రభుత్వం పోలీసులతో లాఠీఛార్జి చేయించడం అమానుషమని బీజేపీతెలంగాణ రాష్ట్రాధ్యక్షులు డాక్టర్‌ కె లక్ష్మణ్‌ చెప్పారు. ప్రభుత్వతీరు మారకుంటే రైతులతో కలిసి ఆందోళనలు చేపడతామని చెప్పారు.

కోదండరాం

కోదండరాం

ప్రభుత్వం ప్రతిష్టకు పోయి రైతుల నుంచి బలవంతపు భూసేకరణ చేస్తోందని తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ ఆచార్య కోదండరాం అన్నారు. ఆదివారం రాత్రి సంగారెడ్డిలో విలేకర్లతో మాట్లాడుతూ.. భూసేకరణ విషయంలో వెనక్కి తగ్గబోమని లాఠీఛార్జితో ప్రభుత్వం తన విధానాన్ని స్పష్టం చేసిందన్నారు. సోమవారం మల్లన్నసాగర్‌ బాధితులను కలిసి భవిష్యత్తు ప్రణాళిక ప్రకటిస్తామన్నారు.

హరీష్ రావు

హరీష్ రావు

భూసేకరణ చట్టం విషయంలో ఢిల్లీలో ఒక మాట, తెలంగాణలో ఒక మాట చెప్తూ టిడిపి నాయకులు రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తున్నారని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు మండిపడ్డారు. 2013 భూసేకరణ చట్టం రద్దు చేస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌పై కేంద్ర క్యాబినెట్‌లో ఉన్న టిడిపి మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి సంతకాలు చేయలేదా? అని ప్రశ్నించారు.

హరీష్ రావు

హరీష్ రావు

ఢిల్లీలో 2013 భూసేకరణ చట్టం వద్దనే వాళ్లు తెలంగాణలో అదే చట్టం కింద నష్టపరిహారం చెల్లించాలనడమేంటని నిలదీశారు. ఇది రెండు నాలుకల ధోరణి కాదా? అని హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ రాజధాని అమరావతికి 50వేల ఎకరాలు అవసరమా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. సేకరించిన ఆ భూమికి 2013 భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం చెల్లించారా? చెప్పాలన్నారు.

హరీష్ రావు

హరీష్ రావు

ప్రతిపక్ష పార్టీలకు ప్రజల ప్రయోజనాలు ముఖ్యమా? రాజకీయాలు ముఖ్యమా? అని హరీశ్ ప్రశ్నించారు. అసలు ముంపు గ్రామాలకు మీరు పదేపదే ఎందుకు వెళుతున్నారు? భూసేకరణ విషయంలో ప్రభుత్వం ఎక్కడా బలవంతం చేయడం లేదన్నారు. ప్రజలు సమ్మతిస్తేనే వారి భూముల రిజిస్ట్రేషన్లు చేస్తున్నామన్నారు. ఏటిగడ్డ కిష్టాపూర్ రైతులు ఎక్కడైతే దీక్షలు చేశారో అదే చోట వారి అనుమతితో ఇవాళ రిజిస్ట్రేషన్లు అవుతున్నాయన్నారు.

హరీష్ రావు

హరీష్ రావు

నర్సాపూర్‌కు లక్ష ఎకరాలకు సాగునీరు ఇద్దామనుకున్నామని, ఇది నీకు ఇష్టం లేదా అని మాజీ మంత్రి సునీతను నిలదీశారు. కుట్రలు వద్దన్నారు. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా.. అందోల్ నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగు నీరు ఇద్దామనుకున్నామని, వద్దా అని ప్రస్నించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లోకి వెళ్లి ప్రజలను రెచ్చగొడుతున్నారని, కవ్వింపు చర్యలకు పాల్పడుతూ పోలీసులపై రాళ్లు రువ్వారని హరీశ్ రావు ఆరోపించారు. టీడీపీ నాయకుల చర్యల వల్లనే గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిగినట్లు తెలుస్తోందన్నారు.

ఆగ్రహానికి గురైన ప్రజలు పోలీసులపైకి రాళ్లు, ఇటుకలు, కర్రలు విసిరారు. దీంతోవారు గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. మూడు భాష్పవాయు గోళాలను వదిలారు. చెదిరిపోయిన జనం ఎర్రవల్లి వద్ద పోలీసులకు, ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినదించారు.

ప్రాణాలైనా వదిలేస్తాం కానీ, మల్లన్న సాగర్‌కు గ్రామాలు ఇవ్వబోమని నిర్వాసితులు తేల్చి చెప్పారు. ప్రజలను చెదరగొట్టడానికి నాలుగుసార్లు లాఠీఛార్జి చేశారు. తెలుగు రైతు రాష్ట్రాధ్యక్షుడు వంటేరు ప్రతాప్ రెడ్డికి గాయాలయ్యాయి. ఇద్దరు రైతుల చేతులు విరిగాయి. మహిళలకు దెబ్బలు తగిలాయి.

ప్రజలు రాళ్లు విసరడంతో కుకునూరుపల్లి ఎస్సై రామకృష్ణారెడ్డి సహా ముగ్గురు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. పోలీసుల లాఠీదెబ్బలకు ముగ్గురు యువకులకు తీవ్రగాయాలవ్వగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో సుమారు 50 నుంచి 60 మందికి గాయాలయ్యాయి.

English summary
At least 10 farmers from various villages fearing submergence due to proposed Mallanna Sagar irrigation project were injured in baton charge by police near Yerravalli village in Medak district today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X