రైతు బంధు నిలిపివేతకు ఆయనే కారణం: మంత్రి హరీష్ రావు ఫస్ట్ రియాక్షన్
సంగారెడ్డి: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గడువు సమీపించింది. పోలింగ్‌కు మూడు రోజులే మిగిలివున్నాయి. ఎన్నికల ప్రచారానికి ఇంకొక్క రోజే గడువు. 28వ తేదీ సాయంత్రానికి ప్రచారానికి తెర పడుతుంది. 30వ తేదీన పోలింగ్. ఈ చివరి రెండు రోజులు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం హోరెత్తనుంది.
ఈ పరిస్థితుల్లో అధికార భారత్ రాష్ట్ర సమితికి బిగ్ షాక్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఇదివరకు రైతుబంధు (Rythu Bandhu) అమలుకు జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు (T Harish Rao) బహిరంగంగా దీనిపై చేసిన ప్రకటనలు, వ్యాఖ్యలే కారణమని తేల్చింది.

దీనిపై హరీష్ రావు (Harish Rao) స్పందించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రస్తుతం ఆయన ఉమ్మడి మెదక్ జిల్లాలో పర్యటిస్తోన్నారు. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సభలో ఆయన మాట్లాడుతున్న సమయంలోనే రైతు బంధు పథకానికి ఈసీ బ్రేకులు వేసిందనే సమాచారం అందింది.
రైతుబంధు పథకాన్ని ఈసీ నిలిపివేయడం వెనుక కాంగ్రెస్ హస్తం ఉందని హరీష్ రావు ఆరోపించారు. రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న వైఖరి దీనితో తేటతెల్లమైందని మండిపడ్డారు. రైతు బంధుపై కాంగ్రెస్ కుట్ర మరోసారి బయటపడిందంటూ ధ్వజమెత్తారు. రైతుబంధును కాంగ్రెస్ పార్టీనే ఆపించిందనడానికి నిదర్శనాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.
రైతు బంధుపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఛైర్మన్ నిరంజన్.. ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుందని హరీష్ రావు విమర్శించారు. రైతులకు పంట సాయం పంపిణీ చేయడానికి ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చిన తరువాత కూడా కాంగ్రెస్ కుట్ర చేసిందని హరీష్ రావు అన్నారు.

కాంగ్రెస్ కుట్రను తెలంగాణ రైతులు, ప్రజలు.. ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు.. ఇలా ఏ ఒక్క వర్గానికి మేలు చేయాలని చూసినా దాన్ని కాంగ్రెస్ అడ్డుకుంటుందనడానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదని చెప్పారు. ఈ నెల 30వ తేదీన కారు గుర్తుకు ఓటు వేసి, కాంగ్రెస్‌ను తరిమి కొట్టాలని ఆయన ఓటర్లను కోరారు.












Click it and Unblock the Notifications