అప్పటి కేసీఆర్ సీటు ఇప్పుడు రేవంత్‌కు: తెలంగాణ భావి సీఎం అవుతారా?
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ లాబీల్లో ఇప్పుడు సీట్ నెంబర్ 123పై ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. టీఆర్ఎస్ చేపట్టిన 'ఆపరేషన్ ఆకర్ష్' లో భాగంగా టీడీపీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో తెలంగాణలో టీడీపీకి కేవలం ముగ్గురు మాత్రమే మిగిలారు.
ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో తాజాగా సీట్ల కేటాయింపు చేశారు. మిగతా పార్టీలకు సీట్ల కేటాయింపులో కూడా పలు మార్పులు చేర్పులు చేశారు. ఈ మార్పులో భాగంగా తెలంగాణ టీడీపీ ఫ్లోర్ లీడర్ రేవంత్ రెడ్డికి ఓ సీటు కేటాయించారు. దాని నెంబరు 123. ఈ సీట్ గురించి అసెంబ్లీ లాబీల్లో పెద్ద చర్చ నడుస్తోంది.
అదేంటో తెలుసుకోవాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే. అది 1999వ సంవత్సరం. చంద్రబాబు రెండోసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యారు. కేసీఆర్‌కు మంత్రి పదవి దక్కలేదు. కేవలం డిప్యూటీ స్పీకర్ పదవి మాత్రమే ఇచ్చారు. ఈ క్రమంలో కేసీఆర్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.

అప్పటి నుంచి ఆయన తెలంగాణ ఉద్యమానికి తెరలేపారు. రెండేళ్ల తర్వాత కేసీఆర్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. తెలంగాణ ఉద్యమానికి నాంది పలికారు. తాను రాజీనామా చేసిన సిద్ధిపేట నుంచి ఉపఎన్నికలో గెలిచి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు.
అలా అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్‌కు ఓ సీటు కేటాయించారు అప్పటి స్పీకర్ ప్రతిభా భారతి. ఆ సీటు నెంబర్ 123. ఆ తర్వాత 14 ఏళ్ల ఉద్యమం అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, ఆయన స్థాపించిన టీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
సీఎంగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించారు. తెలంగాణలో టీడీపీని ఖాళీ చేయడమే లక్ష్యంగా మెజారిటీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. పార్టీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న ఎర్రబెల్లిని సైతం టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు.
ఆ తర్వాత టీడీఎల్పీని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేస్తున్నట్టు స్పీకర్‌కు లేఖ కూడా ఇప్పించారు. ఎర్రబెల్లి నేతృత్వంలోని టీడీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన లేఖను స్పీకర్ మధుసూదనాచారి పరిగణనలోకి తీసుకున్నారు. టీఆర్ఎస్‌లోకి చేరిన టీడీపీ ఎమ్మెల్యేలకు అధికార పక్షం వైపు అసెంబ్లీలో సీట్లు కేటాయించారు.
టీడీపీలో మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒకరికి మూడో వరుసలో, మిగిలిన ఇద్దరికి నాలుగో వరుసలో సీట్లు కేటాయించారు. అందులో భాగంగా టీడీపీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న రేవంత్ రెడ్డికి నాలుగో వరుసలో ఉన్న 123వ నంబర్ సీటు కేటాయించారు. దీంతో ఆ సీటుపై అసెంబ్లీ లాబీల్లో చర్చ మొదలైంది.
చివరకు చూస్తే అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన కేసీఆర్‌కు కేటాయించిన సీటు అదేనని తేలింది. దీంతో ఇప్పుడు ఈ సీటుపై టీడీపీలో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో కేసీఆర్‌కు కేటాయించిన సీటు ప్రస్తుతం రేవంత్ రెడ్డికి రావడం యాదృచ్చికమే అంటున్నారు.
అయితే టీడీపీ నేతలు మాత్రం రేవంత్ రెడ్డిని కేసీఆర్‌తో పోలుస్తూ భవిష్యత్ నాయకుడిగా అభివర్ణిస్తున్నారు.












Click it and Unblock the Notifications