21న తెలంగాణ కేబినెట్ భేటీ: రుణమాఫీ సహా కీలక అంశాలపై చర్చకు ఛాన్స్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జూన్ 21న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సచివాలయంలో జరగనుంది. ఆగస్టు 15లోగా రైతు పంట రుణాల మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రధానంగా ఇదే అంశంపై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
రుణమాఫీకి సుమారు రూ. 30 వేల కోట్లు, రైతు భరోసాకు మరో రూ. 7 వేల కోట్లు అవసరమవడంతో.. నిధుల సేకరణ ఎలా అనే అంశంపైనా మంత్రివర్గంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ రూపకల్పన, పంటల బీమాపైనా కేబినెట్ చర్చించనున్నట్లు సమాచారం.

ఆగస్టు 15లోగా రూ. 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాగా, రైతుబంధు పథకం కింద తెలంగాణలో 66 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో రూ. 2 లక్షల లోపు రుణాలు పొందినవారు దాదాపు ఇంతమందే ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, రైతుబంధు లబ్ధిదారుల్లో దాదాపు 6 లక్షల మందికి పట్టాదారు పాస్‌బుక్‌లు లేవు. వాటిని ప్రామాణికంగా తీసుకుంటే లబ్ధిదారుల సంఖ్య 60 లక్షలకు తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.
ఇది ఇలావుంటే, కుటుంబంలోని ఇద్దరు, ముగ్గురికి రైతుబంధు వస్తోంది. వారందరికీ రేషన్ కార్డుల్లేవు. కుటుంబ పెద్దకు మాత్రమే ఉంది. రేషన్ కార్డు నిబంధన పెడితే కుటుంబంలో రైతుకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని, దీంతో మరో 18 లక్షల మంది తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపన్ను చెల్లింపుదారులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మినహాయిస్తే మరో రెండు లక్షల మంది తగ్గుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే రుణమాఫీ పథకానికి అర్హులయ్యేవారు 40 లక్షల మంది వరకే ఉంటారని అంటున్నారు.












Click it and Unblock the Notifications