ఆసియాలోనే అతిపెద్ద గృహ సముదాయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్, ప్రత్యేకతలివే
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా కొల్లూరులో రెండో దశ కింద చేపట్టిన ఆసియాలోనే అతిపెద్ద గృహ సముదాయం కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూం ఇళ్లు డిగ్నిటీ హౌసింగ్ కాలనీని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఆరుగురు లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందించారు. అంతకుముందు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్ సందర్శించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. సుమారు 60 వేల మంది ఆవాసం ఉండేలా ఒకేచోట ఏకంగా 15,660 ఇళ్ల నిర్మాణాన్ని తెలంగాణ సర్కారు చేపట్టింది.

సుమారు లక్ష జనాభా ఆవాసం ఉండేలా ఒకేచోట ఏకంగా ఈ ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాజెక్ట్‌ను ఎస్+9లో 38 బ్లాక్‌లు, ఎస్+10లో 24 బ్లాక్‌లు, ఎస్+11లో 55 బ్లాక్‌లు.. మొత్తం 117 బ్లాక్‌లుగా నిర్మించింది. ఒక్కో డబుల్ బెడ్‌రూం విస్తీర్ణం 580 ఎస్‌ఎఫ్‌టీ వరకు ఉంటుంది. ప్రతి బ్లాక్‌కు 2 లిఫ్ట్‌ల చొప్పున మొత్తం 234 లిఫ్ట్‌లు, జనరేటర్లను ఏర్పాటు చేశారు. ప్రతి ఫ్లోర్‌లో ఫైర్ సేఫ్టీని ఏర్పాటు చేశారు. 36 మీటర్లు, 30 మీటర్ల ఔటర్ రోడ్లు, 8 మీటర్లు, 6 మీటర్ల ఇన్నర్ రోడ్లను వేశారు.
నిరుపేదల కోసం సకల సౌకర్యాలతో కొల్లూరులో ఈ ఆదర్శ టౌన్‌షిప్‌ను నిర్మించింది ప్రభుత్వం. నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా కార్పొరేట్ హంగులతో పేదల కోసం కలల సౌధాలను నిర్మించింది. రూ.1,489.29 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టులో కార్పొరేట్ అపార్ట్‌మెంట్లకు తీసిపోకుండా సకల సౌకర్యాలతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించారు.
12 అండర్ గ్రౌండ్ వాటర్ సంప్‌లను నిర్మించారు. ఒక్కో సంపు 11 లక్షల లీటర్ల సామర్థ్యం ఉంటుంది. 90 లక్షల లీటర్ల సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. వర్షపు నీటిని సంరక్షించేందుకు ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టింది. అండర్ గ్రౌండ్ ద్వారా కరెంట్ కేబుల్‌ని ఏర్పాటు చేసింది. మురికినీటి బాక్సులపై 10.55 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్‌ని ఏర్పాటు చేసింది.
కొల్లూరు డబుల్ ఇళ్ల సమూదాయంలో బస్టాండ్, పోలీస్ ఔట్‌పోస్టు, ఫైర్ స్టేషన్, మున్సిపల్ బిల్డింగ్, ప్రభుత్వ ఆస్పత్రి, పీహెచ్‌సీ సెంటర్, గుడి, చర్చి, మూడు షాపింగ్ కాంప్లెక్స్‌లు, హైస్కూల్, అంగన్‌వాడీ భవనాలు, ప్రతి సెక్టార్‌లో పాలకేంద్రాలు, ఫంక్షన్‌హాళ్లు, శ్మశానవాటిక, ద్విచక్ర వాహనాల పార్కింగ్, బ్యాంక్, ఏటీఎంలు, పోస్టాఫీస్, మార్కెట్, పెట్రోల్ బంక్, కమ్యూనిటీ సెంటర్లు తదితర సౌకర్యాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
Watch Live: CM Sri KCR inaugurating 2BHK Dignity Housing Colony at Kollur in Sangareddy District. https://t.co/LmtmFcgecL
— Telangana CMO (@TelanganaCMO) June 22, 2023
డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయం అనంతరం వెలిమల శివారులోని మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. రూ.183కోట్లతో నిర్మించిన 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఆస్పత్రి నిర్మాణం కోసం ప్రభుత్వం 25 శాతం నిధులు ఇస్తుండగా.. మిగిలిన వ్యయాన్ని కాలుష్య నియంత్రణ మండలి భరించనుంది. చివరగా బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను మంత్రి హరీశ్‌రావు దగ్గరుండి పర్యవేక్షించారు.












Click it and Unblock the Notifications