సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ వెనుక- దీదీతో కలిసి ముందుకు : జగన్ కలిసొస్తారా - అసలు లక్ష్యం అదే ..!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ చేరారు. ఆయన మూడు..నాలుగు రోజులు ఢిల్లీలోనే ఉండనున్నారు. ధాన్యం కొనుగోలు అంశంపై ప్రధాని మోదీ, కేంద్ర వ్యవసాయ, ఆహార శాఖ మంత్రులతో ఒకటి, రెండు రోజుల్లో కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన మోదీ అపాయింట్‌మెంట్ కోరినట్లు సమాచారం. కేసీఆర్ సతీమణి శోభకు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. కరోనా నుంచి కోలుకున్న శోభకు తదనంతరం ఊపిరితిత్తుల్లో సమస్య తలెత్తింది. దీంతో ఆమెకు ఎయిమ్స్‌లో పరీక్షలు చేశారు.
Recommended Video

ఢిల్లీ కేంద్రం కేసీఆర్ కొత్త అడుగులు
ఇదే సమయంలో రాజకీయంగానూ కీలక అడుగులు వేస్తున్నారు. 2018 లో ఆయన జాతీయ రాజకీయాల్లో తాను కీలకంగా వ్యవహరిస్తానని..పార్టీలను ఏకతాటి పైకి తెచ్చే ప్రయత్నాలు చేసారు. కానీ, అప్పట్లో అది సాధ్యపడలేదు. ఇక, కేసీఆర్ తిరిగి రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత..కొద్ది రోజులుగా రాజకీయ పరిణామాల్లో మార్పు కనిపిస్తోంది. హజూరాబాద్ ఫలితం తరువాత బీజేపీని డైరెక్ట్ గా టార్గెట్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పైన పదునైన విమర్శల ను ఎక్కు పెట్టారు. ఇక, ఇప్పుడు ఢిల్లీ పర్యటన ద్వారా జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ అడుగులు ప్రారంభిస్తున్నట్లుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

మమతతో కేసీఆర్ భేటీ అవుతారంటూ
అందులో భాగంగా కేసీఆర్ ఇదే సమయంలో మూడు రోజుల పర్యటన కోసం ఢిల్లీ వస్తున్న బెంగాల్ ముఖ్యమంత్రి మమతతో సమావేశం అవుతారని తెలుస్తోంది. గతంలోనూ కేసీఆర్ స్వయంగా కోల్ కతా వెళ్లి మమతతో మంతనాలు చేసారు. కేసీఆర్ అనూహ్యంగా ఢిల్లీ కేంద్రంగా రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ మృతి చెందిన రైతుల కుటుంబాలకు తెలంగాణ సర్కారు తరఫున ప్రకటించిన రూ.3 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. రైతు సంఘాల నేతలను అలా మరణించిన వారి జాబితా కోరారు. రైతు సంఘాల నేతలు సైతం కేసీఆర్ నిర్ణయం పైన హర్షం వ్యక్తం చేసారు.

ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా
ఈ పర్యటనలో కేసీఆర్ వారిని కలిసి ఆ మేర చెక్కులు అందించే అవకాశం ఉంది. ఇక, మమతా బెనర్జీతో జాతీయ రాజకీయాల పైన చర్చించే ఛాన్స్ ఉంది. మమతా సైతం పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు బీజేపీ వ్యతిరేక పార్టీలతో చర్చల కోసమే ఢిల్లీ వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాని అప్పాయింట్ మెంట్ సైతం మమత కోరారు. గతంలో కాంగ్రెస్ తో సఖ్యతగా కనిపించిన మమతా..ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వం పై నమ్మకం కోల్పోయినట్లుగా కనిపిస్తోంది. దీంతో..కలిసొచ్చే పార్టీలతో కలిసి ముందుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని..అందులో భాగంగానే కేసీఆర్ తో సమావేశం కానునున్నట్లు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది.

కేంద్రంతో యుద్దమేనంటూ ఢిల్లీ పర్యటన
అదే విధంగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతుల డిమాండ్లలో భాగంగా..కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ తో కలిసి పని చేయటానికి కేసీఆర్ విముఖంగా ఉన్నారు. దీంతో..ప్రాంతీయ పార్టీల నేతలతోనే ముందుకు వెళ్లే ఆలోచనలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్.. ఏపీ సీఎం జగన్.. బీహార్ లో ఆర్జేడీ..ఆప్ వంటి పార్టీలతో సమావేశాలు రానున్న రోజుల్లో ఉంటాయని చెబుతున్నారు. శివసేన, డీఎంకే, ఎన్సీపీ వంటి పార్టీలు కాంగ్రెస్ తో కలిసి ఉన్నాయి. అయితే, ఏపీలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత జగన్ - కేసీఆర్ మధ్య సత్సంబంధాలు కొనసాగినా.. వాటర్ వార్ తో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది.

జగన్ తో మంతనాలు.. ఏపీ సీఎం కలిసిసొస్తారా
కానీ, తాజాగా ఆదివారం ఒక వివాహ వేడుకలో ఇద్దరూ మరలా ఆత్మీయంగానే కనిపించారు. కేంద్రం తమకు ఏరకంగానూ అండగా నిలవకపోవటం పైన జగన్ సైతం అసహనంతోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. కానీ, ఇప్పటికిప్పుడు కేంద్రంతో జగన్ విభేదించే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. కేసీఆర్ మద్దతు కూడగట్టే క్రమంలో జగన్ తో ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఇదే సమయంలో తన కుమార్తె కవితను రాజ్యసభకు పంపేందుకు కేసీఆర్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా..ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సారి ఢిల్లీ పర్యటన ఆసక్తి కరంగా మారుతోంది. ఈ పర్యటనలో చోటు చేసుకొనే పరిణామాల ఆధారంగా తెలంగాణ రాజకీయాల్లోనూ కొత్త సమీకరణాలు చోటు చేసుకొనే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications