రైతులకు గుడ్‌న్యూస్: పంట పెట్టుబడి చెల్లింపులు ప్రారంభించిన రేవంత్ సర్కారు
హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా కొలువైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది. రైతులకు పంట పెట్టుబడి సాయం చెల్లింపులను సర్కారు ప్రారంభించింది. ఇప్పటికే ట్రెజరీలో ఉన్న నిధుల విడుదలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ హామీ ఇచ్చిన రైతు భరోసా పథకానికి ఇంకా విధి విధానాలు ఖరారు కాలేదు. ఈ క్రమంలో గతంలో మాదిరి రైతులకు పెట్టుబడి సాయం చెల్లింపులు చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు.
సీఎం రేవంత్ వరుస సమీక్షలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుసగా వివిధ శాఖలపై సమీక్షలు నిర్వహిస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. సోమవారం ఉద్యోగాల భర్తీపై ఆయన రివ్యూ నిర్వహించారు. పూర్తి వివరాలతో రావాలని టీఎస్‌పీఎస్సీ అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలతోపాటు నోటిఫికేషన్ వివరాలతో తీసుకురావాలని సీఎం ఆదేశించారు.

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి, సెక్రటరీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన, పరీక్షల నిర్వహణ వంటి కీలక అంశాలపై సీఎం రేవంత్ చర్చించినట్లు తెలుస్తోంది. టీఎస్‌పీఎస్సీ పరీక్షలన్నీ రీ షెడ్యూల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
కాంగ్రెస్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం రిక్రూట్‌మెంట్ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో విడుదలైన నోటిఫికేషన్లతో పరీక్ష తేదీలను మార్చనుంది. త్వరలో కొత్త పరీక్ష తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

మరోవైపు, సెక్రటేరియట్‌లో వ్యవసాయ శాఖ అధికారులతో రైతుభరోసా పథకంపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. సచివాలయంలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం అధికారులు, ఎక్సైజ్ శాఖ అధికారులతో కూడా సీఎం రేవంత్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎక్సైజ్, నార్కోటిక్ డ్రగ్స్‌పై సీఎం రేవంత్ సమీక్షించారు. నార్కోటిక్ అధికారులతో ఈ అంశంపై కీలకంగా చర్చించారు. డ్రగ్స్ నియంత్రణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డ్రగ్స్ తీసుకున్నా.. విక్రయించినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. డ్రగ్స్ సరఫరా, వాడకంపై గతంలో పలువురు సినిమా ప్రముఖులకు నోటీసులు ఇచ్చారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ అంశంపై సీఎం రేవంత్ సమీక్షించడం ప్రాధాన్యత సంతరించుకుంది.












Click it and Unblock the Notifications