లింబయ్య ఆత్మహత్య: ఆంధ్రా మీడియా అని ఒకరు, కాత ఎక్కడని మరొకరు!
హైదరాబాద్: భాగ్యనగరంలో ట్యాంక్‌బండ్ పైన ఉరేసుకున్న రైతు లింబయ్య ఆత్మహత్య పైన ప్రభుత్వం స్పందించింది. రైతు ఆత్మహత్యకు వ్యవసాయ రుణాలు కారణం కాదని ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
లింబయ్య ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై త్రిసభ్య అధికారుల కమిటీ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక పంపిందని పేర్కొంది. నిజామాబాద్ జిల్లా రాంరెడ్డిపల్లిలో లింబయ్యకు 6 ఎకరాల భూమి ఉందని, ఈ ఖరీఫ్‌లో మూడెకరాల్లో బోర్ల కింద పంటలు సాగుచేశారని, అవి బాగున్నాయంది.
గత ఏడాది రుణమాఫీ పథకం కింద ఆయనకు పంటరుణం రద్దయిందని, కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగుందని తెలిపింది. గ్రామంలో ఇతరులకు రుణాలు సైతం లింబయ్య ఇచ్చేవారని పేర్కొంది. ఆయన పెద్ద కొడుకు 3 నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని పేర్కొంది.

కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చేర్చించారని పేర్కొంది. లింబయ్యకు కూడా ఎనిమిదేళ్లుగా అనారోగ్యముందని, ఆయనకు, భార్యకు ప్రభుత్వం రూ.చెరో వెయ్యి వంతున పింఛన్ వస్తోందని పేర్కొంది. లింబయ్య తండ్రికి మరో రూ.వెయ్యి పింఛన్ ఇస్తున్నట్లు పేర్కొంది.
లింబయ్య మృతిపై....
లింబయ్య మృతి పైన ఆంధ్రా మీడియా అత్యుత్సాహం ప్రదర్శించిందని నమస్తే తెలంగాణ పత్రిక పేర్కొంది. ఆ కలాల్లో అబద్దాల సిరా ఉందని, కళ్లల్లో విషపు జీర ఉందని పేర్కొంది. రైతుల మనోధైర్యాన్ని దెబ్బతీసే రాతలు రాస్తున్నారని, అర్ధసత్యాలతో అసలు నిజాలకు పాతరేస్తున్నారని అభిప్రాయపడింది.
ఆత్మహత్యల పైన అసత్య కథనాలతో పైశాచిక ఆనందం పొందుతోందని, లింబయ్య మరణంతో ఆంధ్రా మీడియా సెలబ్రేషన్స్ చేసుకుందని, ఆంధ్రా ఆత్మహత్యలపై మాత్రం వ్యూహాత్మక నిశ్సబ్దం పాటిస్తోందని విమర్శించింది.
లింబయ్యకు అప్పులు లేవని, ఉన్న పొలం కౌలుకు ఇచ్చారని, అకౌంటులో రూ.లక్షా పదివేలు ఉన్నాయని, ఇంట్లో ముగ్గురికి ప్రభుత్వం పింఛన్ వస్తున్నట్లు తేలిందని, ఆత్మహత్యకు అనారోగ్యమే కారణమని తెలిసిందని, అయినా ఆంధ్రా మీడియా గగ్గోలు అని పేర్కొంది.
మరోవైపు, లింబయ్య ఆర్థిక పరిస్థితి బాగుందని, అప్పులు ఇచ్చే స్థోమతా ఉందని సర్కారు చెబుతోందని పేర్కొంది. అయితే, అదే సమయంలో కాత, పూత ఎక్కడ!? అని ప్రశ్నించింది. లింబయ్య పంట పొలాలను కామారెడ్డి ఆర్డీవో నగేష్ రెడ్డి గురువారం పరిశీలించారు.
సోయా పంటను పరిశీలించి బాగుందని చెప్పారని పేర్కొంది. అయితే, సోయా ఏపుగా పెరిగిందే తప్ప వర్షాభావం నేపథ్యంలో దానికి కాత లేదు, పూతా లేదని పేర్కొంది. పంట పచ్చగా కనిపిస్తున్నా దిగుబటి వచ్చే అవకాశం ఎంతమాత్రం లేదని వ్యవసాయంపై కనీస పరిజ్ఞానం ఉన్నవారు ఎవరైనా చెబుతారని పేర్కొంది.
లింబయ్య మృతిపై రాజకీయం!
లింబయ్య మృతి పైన రాజకీయం జరుగుతోందని అంటున్నారు. ఓ రైతు ఆత్మహత్య చేసుకుంటే దానిని రాజకీయ అవసరాలకు వాడుకునే యోచన అందరిలోను కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ లింబయ్య ఆర్థిక కారణాలతో చనిపోకుంటే... మిగతా రైతుల సంగతేమిటనే ప్రశ్నను పలువురు లేవనెత్తుతున్నారు.
ఇదిలా ఉండగా, తెలంగాణ కాంగ్రెస్ నేతలు లింబయ్య కుటుంబానికి రూ.లక్ష రూపాయల చెక్కును అందించారు. అదే సమయంలో తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రూ.50వేల ఆర్థిక సాయం చేశారు.
మరోవైపు, న్యూలైఫ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లింబయ్య కుమారుడు నరేష్‌ను శుక్రవారం నిమ్స్ తరలించే అవకాశముంది. కుటుంబ సభ్యులు లింబయ్య అంత్యక్రియలకు వెళ్లడంతో నరేష్ వద్ద ఎవరూ లేనందున గురువారం ఆయనను నిమ్స్‌కు తరలించలేకపోయామని న్యూలైఫ్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications