ఉద్ధవ్‌తో సమావేశం వెనుక కేసీఆర్ పక్కా ప్లాన్: బీజేపీ లబ్ది కోసమే: జగ్గారెడ్డి
హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో అత్యంత కీలక ఘట్టానికి తెర లేచింది. మూడో కూటమి దిశగా సుదీర్ఘ కాలంగా తనవంతు ప్రయత్నాలు చేస్తూ వస్తోన్న టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈ దిశగా ముందడుగు వేశారు. శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో ఆయన సమావేశం అయ్యారు. దీనికోసం ఆయన ముంబైకి వెళ్లారు. కొద్దిసేపటి కిందటే- ఉద్ధవ్ థాకరే సహా శివసేనకు చెందిన కీలక నేతలను కలుసుకున్నారు.
Recommended Video

ఈ భేటీపై అప్పుడే విమర్శలు..
ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశంపై అప్పుడే విమర్శలు, ఆరోపణలు, అనుమానాలు వ్యక్తం కావడం ఆరంభమైంది. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ నేతలు కేసీఆర్ వైఖరిని తప్పుపడుతున్నారు. వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ వ్యూహాత్మకంగా వేసే అడుగుల్లో భాగంగానే- బీజేపీయేతర పార్టీల ముఖ్యమంత్రులను కలుసుకుంటున్నారని, ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నమేనని ఆరోపిస్తోన్నారు.

కేసీఆర్ బీజేపీ మనిషే..
బీజేపీ మనిషిననే ముద్ర నుంచి బయట పడటానికే కేసీఆర్ ఈ ప్రయత్నాలు చేస్తోన్నారని జగ్గారెడ్డి విమర్శించారు. కేసీఆర్ కూడా బీజేపీ మనిషేనని రైతు ఉద్యమ నేత రాకేష్ టికాయత్ చెప్పారని గుర్తు చేశారు. కేసీఆర్ నమ్మదగ్గ నాయకుడు కాదని టికాయత్ చెప్పారని పేర్కొన్నారు. బీజేపీని నేరుగా ఢీ కొట్టే ప్రాంతీయ పార్టీలు డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ మాత్రమేనని స్పష్టం చేశారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు స్టాలిన్, మమత బెనర్జీ ఇద్దరే ప్రధాని నరేంద్ర మోడీతో కొట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు.

యూపీఏలో చీల్చడం ద్వారా ఎన్డీఏకు లబ్ది..
ఈ విషయంలో మరెవరూ దిగినా ఆ ఇద్దరితో సరితూగలేరని తేల్చి చెప్పారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రస్తుతం కాంగ్రెస్‌కు మిత్రపక్షంగా ఉన్నారని జగ్గారెడ్డి గుర్తు చేశారు. యూపీఏలో చీలక తెచ్చే ప్రయత్నం చేయడం ద్వారా.. ఎన్డీఏకు లబ్ది కలిగించాలనేది కేసీఆర్ ప్రయత్నమని ఆరోపించారు. కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా యూపీఏలో చీలికను తీసుకుని రాలేరని పేర్కొన్నారు. కేసీఆర్‌కు మద్దతు ఇవ్వడానికి యూపీఏ మిత్రపక్షాలేవీ సిద్ధంగా లేవని చెప్పారు.

చీకటి ఒప్పందాలు ఉన్నాయ్..
2023లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తాను బీజేపీ మనిషిననే ముద్రను పోగొట్టుకోవడం కేసీఆర్‌కు అత్యవసరంగా మారిందని జగ్గారెడ్డి చెప్పారు. బీజేపీతో కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర సమితికి చీకటి ఒప్పందం ఉందనే విషయాన్ని తాము ముందు నుంచీ చెబుతూ వస్తున్నామని అన్నారు. ఆ ముద్ర నుంచి బయటపడటానికే కేసీఆర్ వ్యూహాత్మకంగా థర్డ్‌ఫ్రంట్‌ను తెరమీదికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇందులో భాగంగానే బీజేపీయేతర ముఖ్యమంత్రులను కలుస్తున్నారని చెప్పారు.

కేసీఆర్‌ను ఎవరూ నమ్మరు..
బీజేపీకి దూరంగా ఉంటోన్న శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీల నాయకులను కలుసుకోవడం ద్వారా తనపై ఉన్న ముద్రను చెరిపేసుకోవాలనేది కేసీఆర్ ప్లాన్ అని, దాన్ని ఎవరూ విశ్వసించబోరని జగ్గారెడ్డి అన్నారు. కేసీఆర్‌ను ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ సారథ్యంలోని ఎన్డీఏ, యూపీఏకు ప్రత్యామ్నాయ కూటమలు ఏర్పాటు కాలేవని అన్నారు. ఏర్పాటు అయినా సుదీర్ఘకాలం పాటు దేశ రాజకీయాల్లో కొనసాగలేవని చెప్పారు.












Click it and Unblock the Notifications