తెలంగాణ కరవు నివారణకు సమరశంఖం.. రూ.150 కోట్లతో పైలట్ ప్రాజెక్ట్.. సక్సెస్ అయితే...
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు తగ్గి కరవు పరిస్థితులు ముంచుకొస్తున్నాయి. తీవ్రమవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం శాశ్వత పరిష్కారాల వైపు అడుగులు వేస్తోంది. రైతులు, గ్రామీణ ప్రజలు ఎప్పుడు కరవు వచ్చినా తట్టుకుని నిలదొక్కుకునేలా సిద్ధం చేసే పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్‌కు రూ.150 కోట్లు కేటాయించారు.
మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్, నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల, నారాయణపేట జిల్లా మక్తల్ మండలాలను ఎంపిక చేశారు.శనివారం రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ, విపత్తు నిర్వహణ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కరవు పరిస్థితులను ఎదుర్కొనే వ్యవసాయ విధానం, నిధుల సక్రమ వినియోగం తదితర అంశాలపై చర్చ జరిగింది. ముఖ్యమంత్రి సూచనల మేరకు నీటి వనరులను సక్రమంగా వినియోగించడం, రైతుల జీవనోపాధిని మెరుగుపరచడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యాలుగా మంత్రి పేర్కొన్నారు.

కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా కరవు ప్రభావిత ప్రాంతాలు, వర్షాధార సాగు ఎక్కువగా ఉన్న జిల్లాలు, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుని ఈ మూడు మండలాలను ఎంపిక చేశామని పొంగులేటి వివరించారు. జాతీయ విపత్తుల నిర్వహణ నిధి సహకారంతో ఈ ప్రాజెక్ట్ అమలు అవుతుందని ఆయన తెలిపారు. ప్రకృతి విపత్తుల శాఖ పర్యవేక్షణలో వ్యవసాయ శాఖ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది.
ఈ ప్రాజెక్ట్‌ను సమర్థవంతంగా అమలు చేయాలంటే ప్రజాప్రతినిధుల సమన్వయం అవసరమని మంత్రి సూచించారు. గ్రామ, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి ప్రతి ఊరిలోనూ గ్రామసభలు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. స్థానిక అవసరాలు, ప్రజాభిప్రాయం ఆధారంగా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని, ప్రభుత్వం కేటాయించే ప్రతి రూపాయీ పారదర్శకంగా, బాధ్యతాయుతంగా లక్ష్యం సాధించేలా ఉపయోగించాలని ఆయన స్పష్టం చేశారు.
కరవు ప్రభావం కేవలం వ్యవసాయ రంగానికే పరిమితం కాదు. గ్రామీణ ఉపాధి, కుటుంబ ఆదాయాలు, సంప్రదాయ వృత్తులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా శాశ్వత పరిష్కారాలు అందించేలా ప్రణాళిక తయారు చేయాలని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికే ఎల్ నినో ముప్పు నేపథ్యంలో గిరిజన కుటుంబాలకు 125 రోజుల ఉపాధి కల్పించడం, నీటి సంరక్షణ పనులు చేపట్టడం వంటి చర్యలు తీసుకుంటోంది.
ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే రాష్ట్రంలోని ఇతర కరవు ప్రభావిత మండలాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది.నీటి సంరక్షణ, వర్షపు నీటి నిల్వ, కరవు నిరోధక పంటల సాగు, మైక్రో ఇరిగేషన్ వంటి చర్యల ద్వారా రైతుల స్వయం సమృద్ధిని పెంపొందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చర్యలు విజయవంతమైతే కరవు వచ్చినప్పుడు కూడా రైతులు తమ జీవనోపాధిని కోల్పోకుండా నిలదొక్కుకునేలా సహాయపడతాయి.













Click it and Unblock the Notifications
