తెలంగాణలోని ఫీల్డ్ అసిస్టెంట్లకు శుభవార్త..
ఫీల్డ్ అసిస్టెంట్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. గతంలో తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్స్ ను తొలగించిన సర్క్యులర్ ను రద్దు చేస్తూ, వారిని తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. నేడు ఫీల్డ్ అసిస్టెంట్స్ అసోసియేషన్ నేతలతో సమావేశం జరిపిన మంత్రి సీతక్క పలు కీలక అంశాలను చర్చించారు. ప్రస్తుతం ఎఫ్ ఏ లకు ఇచ్చే జీతాల్లో తేడాలున్నాయని, వాటిని సవరిస్తామని హామీ ఇచ్చారు.
అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ ల బదిలీలపై కూడా సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్లకు ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి హెల్త్ ఇన్సూరెన్స్, వ్యక్తిగత, గ్రూప్ ఇన్సూరెన్స్ లు ఇచ్చేలా చర్యలు చేపడతామని మంత్రి సీతక్క తెలిపారు. కాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇన్నాళ్లుగా తమను విధుల్లోకి తిరిగి తీసుకోవాలని ఎదురు చూస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు హర్షం వ్యక్తం చేస్తూ.. సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రధానంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు, కూలీల హాజరు నమోదు, పని ప్రదేశాల పర్యవేక్షణ వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తారు. అయితే.. హాజరు నమోదులో అక్రమాలు, అవినీతి ఆరోపణలు.. పని తీరులో లోపాలు వంటి కారణాలతో వారిని తొలగించారు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో రాజకీయ కారణాలు కూడా వారి తొలగింపునకు దారితీశాయని అప్పట్లో విమర్శలు ఉన్నాయి.

మరోవైపు తెలంగాణలోని బ్రాహ్మణుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కు రూ.25 కోట్లు విడుదల చేయనుంది. త్వరలో బడ్జెట్ లో రూ.100 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. నిధులు సద్వినియోగం అయ్యేలా చర్యలు తీసుకుంటామని, బ్రాహ్మణుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.












Click it and Unblock the Notifications