ఎల్ నినో వేళ తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. త్వరలో రేషన్ షాపుల్లో ఆ 6 నిత్యావసర సరుకులు..!
రాష్ట్రంలో నెలకున్న ఎల్ నినో పరిస్థితుల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రజాపంపిణీ వ్యవస్థపై ఆధారపడిన 3.42 కోట్ల మంది పేద, మధ్య తరగతి ప్రజల ఆహార భద్రతను దృష్టిలో పెట్టుకుని వారికి భరోసా కల్పించేలా 14 నెలల అవసరాలకు సరిపడా ఆహార ధాన్యాల నిల్వలను బలోపేతం చేయాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇదే అంశంపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులతో సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో రానున్న వ్యవసాయ సీజన్లలో వర్షపాతం తగ్గినా పేద, మధ్య తరగతి ప్రజల కోసం రేషన్ సరఫరాలకు ఏమాత్రం అంతరాయం కలగకుండా ధాన్యం సేకరణ, బియ్యం నిల్వల నిర్వహణకు ముందస్తు కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే భవిష్యత్తు అవసరాల కోసం కేవలం రానున్న వరి పంట దిగుబడిపైనే ఆధారపడకుండా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేలా సిద్ధంగా ఉండాలని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. మరోవైపు ప్రస్తుతం చౌక ధరల దుకాణాల ద్వారా ప్రధానంగా ఉచిత బియ్యాన్ని మాత్రమే అందిస్తుండగా.. తాజా ప్రణాళిక ప్రకారం గోధుమ పిండి / గోధుమలు, కందిపప్పు, వంట నూనె (పామాయిల్), చక్కెర, చింతపండు, కారం పొడి సరుకులను రాయితీ ధరలకు కార్డుదారులకు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.

అలాగే రుతుపవనాలపై ఎల్ నినో ప్రభావం వల్ల వ్యవసాయ దిగుబడులు తగ్గి, నిత్యావసరాల ధరలు ఆకాశానికి తాకే ప్రమాదం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ క్రమంలో బహిరంగ మార్కెట్లో వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయించకుండా ప్రభుత్వమే నేరుగా రేషన్ ద్వారా సరుకులను అందుబాటులోకి తేవాలని నిర్ణణం తీసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రి ఉత్తమ్ కుమార్ వెల్లడించారు. ఈ మేరకు లబ్ధిదారులకు అందించాల్సిన సరుకుల పరిమాణాలు, సేకరణ ఏర్పాట్లు అలాగే పంపిణీ విధానం.. ప్రభుత్వంపై పడే ఆర్థిక భారాన్ని సమగ్రంగా లెక్కించాలని మంత్రి సూచనలు చేశారు. ఈ వివరాలతో ప్రతిపాదనలు సిద్ధం చేసిన అనంతరం నిత్యావసరాల పంపిణీపై నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications
