తెలంగాణలో మరో మూడు రోజులపాటు విద్యా సంస్థలకు సెలవు: వీడని భారీ వర్షాలు
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలకు సెలవులు మరోసారి పొడిగించింది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతోపాటు అనేకచోట్ల వరద పరిస్థితులు ఉండటంతో మరో మూడురోజులు సెలవులు పొడించాలని నిర్ణయించింది.
ఇప్పటికే పాఠశాలలకు ప్రకటించిన మూడు రోజుల సెలవులు నేటి(బుధవారం)తో ముగియనున్నాయి.గతవారం రోజులుగా వర్షాలు కురుస్తున్నందున రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు మూడురోజుల పాటు (సోమ, మంగళ, బుధవారం) సెలవులు ఇస్తున్నట్లు ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

ప్రభుత్వం తొలుత ప్రకటించిన విధంగా నేటితో సెలవుల గడువు ముగిసిపోనుండటంతో తాజాగా మరో మూడు రోజులు పొడిగించాలని నిర్ణయించింది. దీనిపై బుధవారం సాయంత్రం తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీంతో శనివారం వరకు విద్యాసంస్థలకు సెలవులే. వచ్చే సోమవారం నుంచి విద్యా సంస్థలు తిరిగి ప్రారంభం కానున్నాయి.
మరోవైపు, ఎంసెట్ పరీక్షలపై సందిగ్ధత కొనసాగుతోంది. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఎంసెట్ పరీక్ష వాయిదా వేస్తారనే వార్తలపై సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ స్పష్టతనిచ్చారు. జులై 18 నుంచి 20 వరకు జరిగే ఇంజినీరింగ్ ఎంసెట్ యథాతథంగా ఉంటుందని.. షెడ్యూలులో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. వాయిదా వేస్తే ఆన్‌లైన్ పరీక్షలకు షెడ్యూలు ఖరారు చేయడం కష్టమన్న ఉద్దేశంతో కొనసాగించాలని నిర్ణయించినట్లు నవీన్ మిట్టల్ స్పష్టం చేశారు.అయితే, జులై 14, 15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష మాత్రం వాయిదా వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications