సోదరిని ఇలా అవమానిస్తారా?: అమిత్ షాతో భేటీ తర్వాత తెలంగాణ గవర్నర్ తమిళిసై సంచలనం
న్యూఢిల్లీ: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ టీఆర్ఎస్ సర్కారుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన విషయంలో ఏం జరుగుతుందో తెలంగాణ ప్రజలు, మీడియాకు తెలుసని అన్నారు. రాజ్‌భవన్ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని.. సీఎం, మంత్రులు, సీఎస్ ఎప్పుడైనా రావొచ్చని తెలిపారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన అనంతరం తమిళిసై మీడియాతో మాట్లాడారు.

వ్యక్తిగతంగా అవమానించినా భరిస్తా.. కానీ..: గవర్నర్ తమిళిసై
తనపై తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపుతోందని గవర్నర్ ఆరోపించారు. ప్రొటోకాల్ పాటించడం లేదని.. వ్యక్తిగతంగా తనను అవమానించినా భరిస్తానని, కానీ వ్యవస్థకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. నేను బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాను. అందరితో స్నేహపూర్వకంగా ఉండే వ్యక్తిని నేను. భద్రాచలంలో శ్రీరామనవమి ఉత్సవాలకు హాజరవుతాను. రోడ్డు లేదా రైలు మార్గంలో అక్కడికి వెళ్తాను.
మేడారం జాతరకు కూడా 5 గంటలపాటు రోడ్డు మార్గంలోనే ప్రయాణించి వెళ్లినట్లు సౌందరరాజన్ తెలిపారు. మేడారం వెళితే అధికారులు ఎందుకు రాలేదని గవర్నర్ ప్రశ్నించారు. తెలంగాణ గవర్నర్ పర్యటించాలంటే రోడ్డు మార్గమే దిక్కని అన్నారు. శ్రీరామనవమి ఉత్సవాలకు భద్రాచలం వెళతానని చెప్పారు. యాదాద్రికి వెళితే ఒక్క అధికారి రాలేదని మండిపడ్డారు.

సోదరిగా భావిస్తే ఇలా అవమానిస్తారా?: కేసీఆర్ సర్కారుపై తమిళిసై
రాజ్‌భవన్‌కు ఏ పార్టీతో సంబంధం ఉండదు. ఉగాది వేడుకలకు ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానించాను. రాజ్‌భవన్, గవర్నర్‌ను కావాలనే అవమానిస్తున్నారు. తమిళిసైని కాకపోయినా.. రాజ్‌భవన్‌ను గౌరవించాలి. నేను ఎవర్నీ విమర్శించడం లేదు. రాజ్ భవన్, గవర్నర్ విషయంలో జరిగేది మాత్రమే చెబుతున్నా.
ఒక మహిళను గౌరవించే విధానం ఇది కాదు. సోదరిగా భావిస్తే ఇలా అవమానిస్తారా? అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రశ్నించారు. ఎప్పుడూ నిర్మాణాత్మకంగా ఆలోచిస్తాను. తెలంగాణ ప్రజల కోసమే పని చేస్తాను. తాను ఏది మాట్లాడినా ప్రజల కోసమే అన్నారు. ఎవరి సహకారం అందకపోయినా ముందుకు వెళ్తానని గవర్నర్ తెలిపారు.

రాజ్యంగబద్ధ పదవిలో ఉంటే అలాఎలా అంటారు: తమిళిసై సౌందరరాజన్
ప్రభుత్వ మంచి పనుల్ని తాను అభినందించానని, పలు సూచనలు చేశానని తమిళిసై చెప్పారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పటికీ.. నన్ను బీజేపీ నేత అని ఎలా అనగల్గుతున్నారని ప్రశ్నించారు.గురువారం తెలంగాణ గవర్నర్ ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశారు.
తెలంగాణలో ప్రస్తుత నెలకొని ఉన్న పరిస్థితులను అమిత్‌షాకు వివరించారు గవర్నర్. ఇందుకు సంబంధించి ఓ రిపోర్టును కూడా హోంమంత్రికి అందజేసినట్టు తెలుస్తోంది. తెలంగాణ పుదుచ్చేరి గురించి ఆయనతో చాలా అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ముఖ్యంగా తెలంగాణ పరిస్థితులను వివరించినట్లు గవర్నర్ తమిళి సై తెలిపారు.












Click it and Unblock the Notifications