ఆ ఉద్యోగుల జీతాలు నిలిపివేత, ఐఏఎస్ ల నుంచి జిల్లా స్థాయి వరకు - నిర్ణయం వెనుక..!!
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కొంత కాలంగా ప్రభుత్వం ఉద్యోగులు అందరూ తమ వివరాలను మ్యాపింగ్ చేసుకోవాలని సూచిస్తూ వస్తోంది. దీనికి సంబంధించి అన్ని శాఖలకు ప్రత్యేకంగా సర్క్యులర్లు జారీ చేసారు. వివరాలు నమోదు చేయకుంటే జీతాలు నిలుపు దల చేస్తామని హెచ్చరించారు. అయినా, కొందరు ఉద్యోగులు తమ వివరాలు ఇవ్వకపోవటం తో వారి జీతాలను నిలుపుదల చేస్తూ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. ఈ జాబితాలో ఐఏఎస్ ల నుంచి జిల్లా స్థాయి ఉద్యోగుల వరకు ఉన్నారు.
తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం సంచలనంగా మారుతోంది. ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(ఐఎఫ్‌ఎంఐఎస్)లో తమ వివరాలను మ్యాపింగ్ చేసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సుమారు 5వేల మంది ప్రభుత్వోద్యోగుల మార్చి నెల జీతాలను ప్రభుత్వం నిలిపి వేసింది. గత పది నెలలుగా ప్రభుత్వం పదేపదే హెచ్చరిసున్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై ఈ చర్యలు తీసుకుంది. ఈ జాబితాలో కిందిస్థాయి ఉద్యోగులే కాకుండా పలువురు ఐఏఎస్ అధికారులు కూడా ఉండటం గమనార్హం. అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారిలో పెద్దసంఖ్యలో బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు ప్రభుత్వం అనుమానిస్తోంది. దీంతో పనిచేయకుండానే జీతాలు పొందుతున్న ఉద్యోగుల ఏరివేతే లక్ష్యంగా ప్రతి ఉద్యోగిని ట్రాక్ చేసేందుకు డేటా మ్యాపింగ్‌ను తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో రెగ్యులర్ ఉద్యోగుల్లోనూ చాలా మంది తమ వివరాలను ఐఎఫ్‌ఎంఐఎస్‌లో నమోదు చేసుకోలేదు.

చర్యల దిశగా ప్రభుత్వం కసరత్తు
ఈ వివరాల నమోదు కోసం ప్రభుత్వం పలు మార్లు సమాచారం ఇచ్చింది. ప్రత్యేకంగా సమాచారం అందించింది. వివరాలు ఇవ్వకపోతే జీతాలు నిలుపుదల చేస్తామని హెచ్చరించింది. అయినా... ఆధార్ అనుసంధానం కాకపోవడం, ఐడీ కార్డులో ఉన్న వివరాలకు, ఆధార్‌లో ఉన్న వివరాలకు పొంతన లేకపోవడం వంటి కారణాలతో ఉద్యోగుల వేతనాలు నిలిచిపోయాయి. తన వేతనం నిలిచిపోయిందని గుర్తించిన ఓ ఐఏఎస్ అధికారి.. వెంటనే ఆన్‌లైన్ పోర్టల్‌లో తన వివరాలను నమోదు చేసుకోగా, మిగిలిన ఉద్యోగులు కూడా ఇప్పుడు హుటాహుటిన డేటా మ్యాపింగ్ చేసే పనిలో పడ్డారు. పురపాలక శాఖలో పారిశుద్ధ్య కార్మికుల పేరుతోనూ, ఉన్నతాధికారుల డ్రైవర్లుగా, మంత్రులు, అధికారుల ఇళ్లలో వంటవాళ్లుగా చూపే వారిలోనే ఎక్కువ మంది బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు, ఉనికి లేని ఉద్యోగుల పేరుతో నిధులు డ్రా చేస్తున్న బోగస్ ఏజెన్సీల వ్యవహారంలో ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నేతృత్వంలోని కమిటీ ప్రస్తుతం శాఖల వారీగా సిబ్బంది సంఖ్యను సమీక్షిస్తోంది. ఉద్యోగుల వివరాలకు సంబంధించి నివేదిక సిద్ధం చేసిన తర్వాతే నిలిపిన వేతనాలను విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. నిధులు మళ్లించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా ప్రభుత్వ అడుగులు పడుతుండడంతో.. ఏజెన్సీల్లో కలవరం మొదలైంది. దీంతో, ఇప్పుడు ఈ వ్యవహారం ఎటు టర్న్ తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారుతోంది.












Click it and Unblock the Notifications