ఇక తెలంగాణలో మాస్కులు తప్పనిసరి: 130 హాట్‌స్పాట్‌లు, ‘లాక్‌డౌన్’పై కీలక భేటీ
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తోంది. కరోనా కట్టడికి మరిన్ని చర్యలు చేపడుతోంది. అంతేగాక, లాక్‌డౌన్‌ను కూడా పొడగించాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక మాస్కులు తప్పనిసరి
తాజాగా, కరోనా కట్టడి కోసం మరో నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మాస్కుల వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ తెలంగాణ సర్కారు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇళ్ల నుంచి బయటకు వస్తే తప్పకుండా మాస్కులు ధరించాలని ఆదేశించింది. చాలా మందిలో కరోనా సోకినా లక్షణాలు బయటపడకపోతుండటంతో.. మాస్కుల వినియోగాన్ని తప్పనిసరి చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర సహా పలు చోట్ల మాస్కులను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశాయి.

130 హాట్ స్పాట్‌లు
ఇది ఇలావుండగా, తెలంగాణలో హాట్ స్పాట్ల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 130 హాట్ స్పాట్లను వైద్యారోగ్యశాక గుర్తించింది. ఇక ఒక్క హైదరాబాద్ నగరంలోనే 60 హాట్ స్పాట్ ఉన్నాయి. నిజామాబాద్, కామారెడ్డి, గద్వాల, నల్గొండ, సూర్యాపేట, కరీంనగర్‌లో కొన్ని ప్రాంతాలను గుర్తించారు. కాగా, ఈ హాట్ స్పాట్లలో ర్యాపిడ్ కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. కరోనా సామూహిక వ్యాప్తి చెందకపోవడంతో ర్యాపిడ్ పరీక్షలు అవసరం లేదని ఆరోగ్యశాఖ నిర్ణయించింది.

హాట్ స్పాట్ల గుర్తింపు ఇలా..
కాగా, ఒక ప్రాంతంలో 5-6 కరోనా పాజిటివ్ కేసులు నమోదైతే దాన్ని హాట్ స్పాట్‌గా వైద్యారోగ్యశాఖ గుర్తిస్తోంది. అయితే, కొన్ని చోట్ల రెండు నుంచి మూడు కేసులు నమోదైనా హాట్ స్పాట్లుగా గుర్తించింది. కరోనా తీవ్రతను హాట్ స్పాట్లను గుర్తించడం జరుగుతోంది. ఇక, తెలంగాణలో కరోనావైరస్ పరిస్థితి, లాక్‌డౌన్ అమలు తీరు తదితర అంశాలపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ ప్రత్యేక సమావేశం జరగనుంది.

లాక్‌డౌన్ పొడగింపుపై సీం కేసీఆర్ ప్రకటించే అవకాశం
శనివారం మధ్యాహ్నం 3గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జరిగే ఈ సమావేశంలోనే లాక్‌డౌన్ పొడగించే అంశంపై ప్రత్యేకంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ ఈ విషయంపై స్పందించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications