వీడియో: తెలంగాణలో టీనేజర్లకు కోవిడ్ వ్యాక్సిన్: ప్రారంభించిన మంత్రి హరీష్ రావు
హైదరాబాద్: దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుదల బాట పట్టింది. రెండు రోజుల వ్యవధిలో 15 వేలకు పైగా కొత్త కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. కొత్తగా 33 వేలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కొత్త కేసులు నమోదు కావడం ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చోటు చేసుకోలేదు. అదే సమయంలో- ఒమిక్రాన్ వేరియంట్ విస్తృతమౌతోంది. దేశంలో ఇప్పటిదాకా నమోదైన ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు 1,700గా నమోదయ్యాయి. రోజురోజుకూ ఇవి పెరుగుతున్నాయి.
Recommended Video
సరిగ్గా ఏడాదిలో..
ఈ పరిణామాల మధ్య టీనేజర్లకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. 15 నుంచి 18 సంవత్సరాల్లోపు వయస్సున్న వారికి ఇవ్వాళ్టి నుంచి వ్యాక్సినేషన్ మొదలు కానుంది. గత ఏడాది జనవరి 16వ తేదీన దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. సరిగ్గా ఏడాది తిరిగే సరికి యుక్త వయస్కుల వారికి కూడా కోవిడ్ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకుని రావడంలో కేంద్ర ప్రభుత్వం సఫలం కాగలిగింది. ఇప్పటిదాకా 18 సంవత్సరాలకు పైనున్న వయస్సు గల వారికి మాత్రమే వ్యాక్సిన్ వేస్తోన్న విషయం తెలిసిందే.

యుద్ధ ప్రాతిపదికన అనుమతులు
మూడున్నర రెట్లు వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉన్న ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్రప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఈ అదనపు డోసులు, టీనేజర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అనుమతులను మంజూరు చేసింది. దేశవ్యాప్తంగా అనేక రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు కోవిడ్ పాజిటివ్‌గా తేలడాన్ని పరిగణనలోకి తీసుకుంది. టీనేజర్లకు వ్యాక్సినేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

తెలంగాణలో ప్రారంభించిన మంత్రి హరీష్ రావు
తెలంగాణలో టీనేజర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రారంభించారు. ఈ ఉదయం ఆయన వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ జీ శ్రీనివాస రావుతో కలిసి బంజారాహిల్స్‌లో లాంఛనంగా దీన్ని ఆరంభించారు. వ్యాక్సినేషన్‌ను పర్యవేక్షించారు. డాక్టర్లు, హెల్త్ వర్కర్లతో వివరాలను అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సిన్ వేసుకున్న విద్యార్థులతో ముచ్చటించారు. తెలంగాణలో 15-18 ఏళ్లలోపు టీనేజర్లు 18 లక్షల మందికి పైగా ఉన్నారు. వారందరికీ వ్యాక్సిన్ వేస్తామని అన్నారు. చాలినన్ని టీకాలను సమకూర్చుకుంటున్నామని చెప్పారు.

కోవిన్ వెబ్‌సైట్ ద్వారా..
టీనేజర్లకు వ్యాక్సినేషన్‌కు భారీ డిమాండ్ నెలకొంది. ఈ నెల 1వ తేదీన రిజిస్ట్రేషన్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించగా.. ఇప్పటిదాకా ఎనిమిది లక్షల మందికి పైగా అర్హులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారిక వెబ్‌సైట్ https://www.cowin.gov.in/ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది నిరంతరంగా ప్రక్రియ. వ్యాక్సిన్ డోసులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తరువాత రిజిస్ట్రేషన్ లేకుండా నేరుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులు, ఇతర హెల్త్ కేర్ సెంటర్లలో వ్యాక్సిన్ వేసుకోవచ్చు.

కోవాగ్జిన్..
ప్రస్తుతం దేశంలో ముమ్మరంగా సాగుతోన్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ను విస్తృతంగా వినియోగిస్తోన్న విషయం తెలిసిందే. దీనితోపాటు స్పుత్నిక్ వీ అందుబాటులోకి వచ్చినప్పటికీ.. అది పరిమితంగా ఉంటోంది. వ్యాక్సినేషన్‌లో కోవిషీల్డ్ వాటా అధికంగా ఉంటోంది. కాగా- ఇఫ్పుడు తాజా ప్రారంభించనున్న టీనేజర్ల వ్యాక్సినేషన్‌లో కోవాగ్జిన్‌ను వినియోగించనుంది కేంద్ర ప్రభుత్వం. టీనేజర్లకు కూడా వ్యాక్సిన్‌ను ఇచ్చేలా కోవాగ్జిన్‌ను మరింత అభివృద్ధి చేసింది హైదరాబాదీ ఫార్మాసూటికల్స్ కంపెనీ భారత్ బయోటెక్.












Click it and Unblock the Notifications