శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్ విగ్రహం: ఆవిష్కరణపై స్టే విధించిన హైకోర్టు
హైదరాబాద్: ఖమ్మంలో ఎన్టీఆర్ ఏర్పాటుపై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఇస్కాన్, యాదవ సంఘాలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. విచారణ చేపట్టిన ఉన్నతన్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయొద్దని స్టే విధించింది. మంత్రి పువ్వాడ అజయ్ సహా నిర్వాహకులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఖమ్మం లకారం చెరువులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు(NTR) కృష్ణావతార విగ్రహం ఏర్పాటు చేయాలని అభిమానులు నిర్ణయించారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా మే 28న దీన్ని ప్రారంభించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ 54 అడుగుల విగ్రహాన్ని రూ. 2.3 కోట్లతో నిజామాబాద్‌లో ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు. మరోవైపు, లకారం చెరువు మధ్యలో కేబుల్ బ్రిడ్జి వద్ద ఏర్పాటుకు సన్నాహాుల ప్రారంభమయ్యాయి.

ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు జూ. ఎన్టీఆర్‌ను ఆహ్వానించిన మంత్రి పువ్వాడ
ప్రముఖ టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ను తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఇటీవల కలిశారు. ఖమ్మం నగరాన్ని పర్యాటక ప్రదేశంగా మార్చుతున్న క్రమంలో లకారం ట్యాంక్ బండ్‌పై స్వర్గీయ నందమూరి తారక రామారావు భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మే 28న ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఆయన మనుమడైన జూనియర్ ఎన్టీఆర్ చేతులమీదుగా ఆవిష్కరింపజేయాలని నిర్ణయించారు.
తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ, విదేశాల్లోని ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో జరగనున్న ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ తోపాటు సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, తానా మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ తోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.
కరాటే కళ్యాణికి మంచు విష్ణు నోటీసులు
ఖమ్మంలో ఏర్పాటు చేస్తున్న దిగ్గజ సినీనటుడు, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నందమూరి తారక రామారావు(NTR) విగ్రహంపై వివాదం నెలకొంది. శ్రీకృష్షుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే ఈ వివాదానికి కారణం. ఈ క్రమంలోనే పలువురు విగ్రహ ఆవిష్కరణను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు.
ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై టాలీవుడ్ నటి కరాటే చేసిన వ్యాఖ్యలపై మా అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేగాక, కరాటే కళ్యాణికి 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు నోటీసులు పంపించారు. క్రమశిక్షణ ఉల్లంఘనపై మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలన్నారు.
ఎన్టీఆర్ విగ్రహంపై ఇటీవల కరాటే కళ్యాణి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని కృష్ణుడి రూపంలో పెట్టడం అనేది శ్రీకృష్ణ భగవానుడిని అవమానించడమేనని, ఇది చాలా హేయమైన చర్యగా ఆమె పేర్కొన్నారు. యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ నాయకురాలిగా దీనిని వెంటనే ఆపేయాలని డిమాండ్ చేస్తున్నట్టు కరాటే కళ్యాణి స్పష్టం చేశారు.
మరోవైపు, ఖమ్మంలో శ్రీకృష్ణుడు రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై అఖిల భారత యాదవ సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేవుడి రూపంలో మానవ విగ్రహాలు ఏర్పాటు చేస్తే ధ్వంసం చేస్తామని అఖిల భారత యాదవ సమితి హెచ్చరిక జారీ చేసింది. మే 28వ తేదీన తలపెట్టిన విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిలిపివేయాలని లేదంటే అడ్డుకుంటాం అని , నిరసనలు చేస్తామని ఒక ప్రకటన లో తెలిపింది.












Click it and Unblock the Notifications