ఐఏఎస్ ఆమ్రపాలి గురించి ఈ విషయం తెలుసా?
కేంద్రంలో విధులు నిర్వహించిన ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి తిరిగి తెలంగాణకు వచ్చేశారు. హైదరాబాద్ మెట్రో డెవలప్ మెంట్ అథారిటీ కమిషనర్ గా ఆమెకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. దేశవ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమ్రపాలి సొంతఊరు ప్రకాశం జిల్లా ఒంగోలు శివారులోని ఎన్ అగ్రహారం. ఇక్కడ ఆమె కుటుంబానికి సొంత ఇల్లు ఉంది.
ఆమ్రపాలి తండ్రి పేరు కాటా వెంకటరెడ్డి. ఆయన అదే జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడుకు చెందిన మేనకోడలు పద్మావతిని పెళ్లి చేసుకున్నారు. ఆయన చిన్నతనంలో అగ్రహారంలో విద్యనభ్యసించారు. తన భార్య సొంత ఊరైన ఆలకూరపాడు స్కూల్లో చదువుకున్నారు. టంగుటూరులో హైస్కూలు విద్య, ఒంగోలు సీఎస్‌ఆర్ శర్మ కళాశాలలో ఇంటర్, డిగ్రీ చేశారు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సీటీలో పీజీ పూర్తి చేసి అదే యూనివర్సిటీలో ఎకనమిక్స్ ఫ్రొఫెసర్‌గా ఉద్యోగంలో చేరారు.

వెంకటరెడ్డి తన ఇద్దరు కుమార్తెలను బాగా చదివించారు. ఆమ్రపాలితో పాటు ఆమె సోదరి మానస గంగోత్రి 2007 బ్యాచ్‌కు చెందిన ఐఆర్‌ఎస్ అధికారిణి. ప్రస్తుతం ఆమె కర్ణాటక కేడర్‌లో ఆదాయపు పన్ను శాఖ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. ఐఆర్‌ఎస్‌లో మానస 184వ ర్యాంక్ సాధించారు. ఆమె భర్త ప్రవీణ్ కుమార్ 2010 బ్యాచ్‌కు చెందిన తమిళనాడు ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం అక్కడే పనిచేస్తున్నారు.
ఆమ్రపాలి విశాఖపట్నంలో ఉన్నత చదువులు చదివారు. 2010 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆమె 39వ ర్యాంక్ సాధించారు. తర్వాత ట్రైనీ ఐఏఎస్‌గా, జాయింట్ కలెక్టర్‌గా, నగర కమిషనర్‌గా పనిచేశారు. 2018లో వరంగల్ జిల్లా అర్బన్, రూరల్ కలెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత కేంద్రానికి వెళ్లి.. అక్కడ పీఎంవోలో కీలక బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు తెలంగాణకు తిరిగి వచ్చేశారు. 2018 ఫిబ్రవరి 18న వివాహం జరిగింది. ఆమె భర్త జమ్మూకు చెందిన షమీర్ శర్మ. ఆయన 2011 ఐపీఎస్ బ్యాచ్. ప్రస్తుతం డామన్ డయ్యూ కేంద్రపాలిత ప్రాంతంలో ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications