శ్రావణ మాసంలో నిరుపేదలకు శుభవార్త చెప్పిన తెలంగాణా మంత్రి
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల కోసం సంక్షేమ పథకాలను అందిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని తీసుకొచ్చి ఇల్లు లేని నిరుపేదలకు ఇంటిని ఇవ్వడానికి కంకణ బద్ధమై ఉంది.
అసంపూర్తిగా ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇళ్లను వారికి కేటాయింపు
ఈ క్రమంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ప్రతి జిల్లాలోని శరవేగంగా పనులు జరిపిస్తున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. శ్రావణమాసం వేళ త్వరలోనే నిరుపేదల ఇళ్లల్లో సంతోషం వెల్లివిరియబోతుందని ప్రకటించింది. ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో ఇళ్ల స్థలాలు లేని అర్హత కలిగిన లబ్ధిదారులకు అసంపూర్తిగా ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇళ్లను వచ్చేనెల 15వ తేదీలోగా కేటాయించాలని అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

నిరుపేదలకు ఇండ్లు ఇవ్వడమే ముఖ్యం
ఇందుకు అర్హులైన లబ్ధిదారుల ఎంపికను వెంటనే చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ , హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అంపూర్తిగా ఉన్న ఇండ్లను పూర్తిచేసుకోవడానికి ప్రభుత్వమే లబ్దిదారులకు 5 లక్షల రూపాయిలు ఆర్ధిక సహాయాన్ని అందిస్తుందని ప్రకటించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు దరఖాస్తు ఎప్పుడు చేసుకున్నారనేది ముఖ్యం కాదని నిరుపేదలకు ఇండ్లు ఇవ్వడమే ప్రధానమన్నారు.
శ్రావణ మాసంలో ఇందిరమ్మ ఇళ్ళ గృహప్రవేశాలు
ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నా కూడా వాటిని పరిశీలించాలని కలెక్టర్లకు సూచించారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇసుక, చెల్లింపులు, లబ్దిదారుల ఎంపికలో ఎలాంటి సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శ్రావణ మాసం మొదలైన నేపధ్యంలో త్వరలోనే ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు కూడా ఉంటాయని ఆయన శుభవార్త చెప్పారు.
ఇందిరమ్మ ఇళ్ళ సమస్యల పరిష్కారానికి త్వరలో ఒక టోల్ ఫ్రీ నెంబర్
ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఫిర్యాదులు, సందేహాలు, సమస్యల పరిష్కారానికి హైదరాబాద్‌లోని హౌసింగ్ కార్యాలయంలో త్వరలో ఒక టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారి సూచనల ప్రకారం శాసనసభ్యులు కూడా ఇందిరమ్మ ఇళ్ళను పూర్తి చేసే వరకు అటు అధికార యంత్రాంగం, ఇటు లబ్ధిదారులతో పనుల వేగాన్ని పెంచేలా చర్యలు చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications