బొత్స కామెంట్స్‌పై సబిత ఎదురుదాడి
హైదరాబాద్: తెలంగాణలో పాఠశాలలపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. తమ రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే సహించబోమని, చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తన వ్యాఖ్యలను మంత్రి బొత్స సత్యనారాయణ వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఏపీ విద్యా వ్యవస్థపైనా సబిత ఇంద్రారెడ్డి విమర్శలు గుప్పించారు. ఏపీలో ప్రభుత్వ పాఠశాలల పనితీరు బాగుంటే లక్షలాది మంది విద్యార్థులు ఎందుకు తగ్గారని ప్రశ్నించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు తమను ఆదర్శంగా తీసుకున్నారని గుర్తు చేశారు. తోటి తెలుగు రాష్ట్రం ఏపీ మాత్రం విరుద్ధంగా మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను మెరుగు పరుస్తున్నారని సబి ఇంద్రారెడ్డి అన్నారు. ఇందులో భాగంగా విద్యా వ్యవస్థపై వేల కోట్ల రూపాయలను వ్యయం చేస్తోన్నారని చెప్పారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, రాష్ట్ర ఏర్పడిన ఈ తొమ్మిది సంవత్సరాల్లో 1,050 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామని సబిత ఇంద్రారెడ్డి అన్నారు.
ఒక్కో విద్యార్థి చదువపై తాము లక్షన్నర రూపాయలను ఖర్చు చేస్తున్నామని, అలాగే- విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునే వారికి రెండున్నర లక్షల రూపాయలను వ్యయం చేస్తున్నామని పేర్కొన్నారు. తొమ్మిది సంవత్సరాల్లో రెండుసార్లు ఉపాధ్యాయులను బదిలీలు చేశామని సబిత చెప్పారు. బొత్స అవగాహనరాహిత్యంతో వ్యాఖ్యలు చేశారని సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
తాము రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు బాగుండాలని కోరుకుంటోన్నామని మంత్రి సబిత చెప్పారు. కేసీఆర్ దూరదృష్టితో వ్యవహరిస్తోన్నారని విద్యారంగంతో పాటు అన్నింట్లోనూ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెడుతున్నారని పేర్కొన్నారు. తమ రాష్ట్రంలో ఐఐటీ, మెడికల్, ఇంజినీరింగ్ విద్యార్థులు సాధించిన అత్యుత్తమ ఫలితాలు బొత్సకు కనిపించట్లేదంటూ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications