Strong Room తాళాలు పగలగొట్టి లోపలికి.. డీజీపీ వార్నింగ్
లంగాణలో పురపాలక, నగరపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో డివిజన్లు, వార్డుల వారీగా ఓట్ల లెక్కింపు చేపట్టారు. మధ్యాహ్నం వరకు మున్సిపాలిటీల ఫలితాలు, సాయంత్రానికి కార్పొరేషన్ల ఫలితాలు వెల్లడయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు.
ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిషేధాజ్ఞలు విధించడంతో పాటు లెక్కింపు కేంద్రాల వద్ద విస్తృత పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.

మున్సిపల్ ఓట్ల లెక్కింపు ప్రారంభానికి ముందు కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. స్ట్రాంగ్ రూం తాళం చెవి కనిపించకపోవడంతో అధికారులు గడ్డపార సహాయంతో తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. ఈ ఘటన కొంతసేపు ఉద్రిక్తతకు దారితీసినా, అనంతరం పరిస్థితి అదుపులోకి వచ్చింది.
ఇదిలా ఉండగా, ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులు మరియు ప్రభుత్వ అధికారులపై ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ శివధర్ రెడ్డి హెచ్చరించారు. ప్రజాప్రతినిధులైనా, అభ్యర్థులైనా, రాజకీయ పార్టీల కార్యకర్తలైనా చట్టానికి ఎవరూ అతీతులు కారని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేసినా చట్టం తన పని తాను చేసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ లేదా పోలీసు ఉద్యోగులపై ఏవైనా ఫిర్యాదులు ఉంటే రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేదా పై అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.












Click it and Unblock the Notifications