తిరుమలకు కెసిఆర్: శ్రీవారికి తెలంగాణ కానుకలు ఇవే...
హైదరాబాద్: తన మొక్కు తీర్చుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఈ నెలాఖరున తిరుమల వెళ్లనున్నారు. ప్రత్యేక రైలులో తన బృందంతో ఆయన తిరుమల వెళ్తారని సమాచారం. తెలంగాణ ఏర్పడితే శ్రీవారికి స్వర్ణాభరణాలు చేయిస్తానని కెసిఆర్ మొక్కుకున్నారు.
స్వామివారికి కేసీఆర్ సమర్పించే ఆభరణాల తయారీ టెండర్లను తమిళనాడు కొయంబత్తూర్‌కు చెందిన కీర్తిలాల్ కాలిదాస్ జ్యువెలర్స్ దక్కించుకుంది. ఇప్పటికే స్వామికి ఇవ్వనున్న కానుకల్లో శాలిగ్రామ హారం, మకరకంఠ సిద్దమయ్యాయి.

ఇరవై కిలోల బరువు తూగే ఈ రెండు ఆభరణాలను దాదాపు రూ.5 కోట్లు వెచ్చించి తయారు చేయించారు. మరో 15 రోజుల్లో మిగిలిన ఆభరణాల తయారీ కూడా పూర్తవుతుంది. ఆభరణాలను తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా తయారు చేశారు.

వీటితో పాటు విజయవాడ కనకదుర్గమ్మ, వరంగల్ భద్రకాళీ దేవాలయం, కురివి వీరభద్రస్వామి మొక్కులను కెసిఆర్ తీర్చుకుంటారు. ఈ మూడింటింకి చెందిన ఆభరణాలను త్వరలోనే తయారు చేయించనున్నారు. మొదటి విడతగా తిరుమలేశుని ఆభరణాలను తయారుచేయించారు. సాంస్కృతిక శాఖ సలహాదారుడు కేవీ రమణాచారి నేతృత్వంలో, వేములవాడ దేవస్థాన ఈవో రాజేశ్వర్ ఈ ఆభరణాల తయారీకి చైర్మన్‌గా వ్యవహరించారు.












Click it and Unblock the Notifications