పోలీసు ఉద్యోగాల భర్తీలో అక్రమాలపై సమాచారమివ్వండి: రూ. 3 లక్షలు గెలుచుకోండి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల భర్తీ ఎంతో పారదర్శకంగా జరుగుతోందని పోలీసు నియామక మండలి ఛైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. అక్రమాలు జరుగుతున్నట్లు తెలిస్తే పోలీసు నియామక మండలి దృష్టికి తీసుకురావాలని సూచించారు. అంతేగాక, పక్కా సమాచారం ఇచ్చిన వారికి రూ. 3 లక్షల పారితోషికం కూడా ఇస్తామని ప్రకటించారు.
మే నెల 14 నుంచి 26వ తేదీ వరకు 97 వేల మందికిపైగా అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. కొందరు అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. పోలీసు ఉద్యోగాల కోసం మొత్తం 12.9 లక్షల దరఖాస్తులు వచ్చాయని, 3 దశల్లో ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టామని పోలీసు నియామక మండలి ఛైర్మన్ తెలిపారు.

ప్రాథమిక అర్హత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, తుది పరీక్షలు నిర్వహించామని.. తుది రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ధృపత్రాలు పరిశీలన పూర్తయిందని వెల్లడించారు. వయసు, విద్యార్హత విషయంలో నోటిఫికేషన్‌లోనే స్పష్టంగా పేర్కొన్నామన్నారు. అయితే, కొందరు అభ్యర్థులు వయసు, విద్యార్హత లేకున్నా దరఖాస్తు చేశారని తెలిపారు. అలాంటి అభ్యర్థుల దరఖాస్తులను తిరస్కరించామని పోలీసు నియామక మండలి ఛైర్మన్ శ్రీనివాసరావు వెల్లడించారు.
తెలంగాణ గ్రూప్-3లో మళ్లీ అదనంగా కలిసిన పలు పోస్టులు
తెలంగాణ గ్రూప్-3 ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ప్రభుత్వం నుంచి మరో శుభవార్త అందింది. గ్రూప్-3 ఉద్యోగ ప్రకటనలో అదనంగా మరో 13 పోస్టులు చేరుస్తూ టీఎస్‌పీఎస్సీ ప్రకటన వెలువరించింది. మొదట 1363 పోస్టులతో గత డిసెంబర్ 30న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు బీసీ గురుకుల సొసైటీలో ఖాళీగా ఉన్న 12 పోస్టులను అదనంగా చేర్చడంతో మొత్తం పోస్టులు 1375కి పెరిగాయి.
తాజాగా, నీటిపారుదల శాఖ ఈఎన్సీ కార్యాలయంలో 13 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించింది. ఇప్పుడు మరోసారి 13 పోస్టులు కలపడంతో మొత్తం పోస్టుల సంఖ్య 1388కి పెరిగింది.
కాగా, గ్రూప్ 3 పోస్టులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జులై లేదా ఆగస్టులో రాత పరీక్ష నిర్వహించనుంది. ఈ పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,36,477 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం మూడు పేపర్లకుగానూ 450 మార్కులకు గ్రూప్ 3 రాత పరీక్ష నిర్వహిస్తారు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మాధ్యమాల్లో పరీక్ష పత్రం ఉంటుంది. అన్ని జిల్లా కేంద్రాల్లో గ్రూప్ 3 పరీక్ష నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది.












Click it and Unblock the Notifications