విషాదం: గల్లంతైన ఇద్దరు రెస్క్యూ సిబ్బంది మృతి, జల దిగ్భంధంలోనే అనేక గ్రామాలు
హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలు రాష్ట్రంలో కల్లోలం సృష్టిస్తున్నాయి. కుమురం భీం జిల్లా దహేగాంలో విషాదం చోటుచేసుకుంది. వరద సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వచ్చి గల్లంతైన రెస్క్యూ సిబ్బందిలో ఇద్దరు మృతిచెందారు. దహేగాం మండలంలోని పెసర కుంట పెద్ద వాగు ఉద్ధృతిగా ప్రవహిస్తుండటంతో సహాయ చర్యల కోసం సింగరేణి సంస్థ రెస్క్యూ టీంను పంపించింది.
ఈ క్రమంలో ఇద్దరు కార్మికులు ఓ గర్భిణీని వాగు దాటించే క్రమంలో ప్రమాదవశాత్తు జారి బుధవారం వరదలో గల్లంతయ్యారు.విషయం తెలుసుకున్న అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం గల్లంతైన వారి మృతదేహాలను కనుగొన్నారు. మృతులు సతీష్, రాముగా గుర్తించారు. వీరు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
మరోవైపు, భారీ వర్షాల కారణంగా తెలంగాణలో అనేక గ్రామాలు ముంపులోనే ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో జిల్లాలో వరదలు కల్లోలం సృష్టిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో అనేక గ్రామాలు వరదముపులోనే కొనసాగుతున్నాయి. కాగా, భారీ వర్షాలు, వరదలతో గర్భిణీ స్త్రీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఇద్దరు గర్భిణులు పురిటి నొప్పులతో బాధపడుతున్నారు. వారిని వెంటనే బంధువులు ఆస్పత్రిలో చేర్పించాలనుకున్నారు. భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద ఎక్కువగా వస్తోంది. ఇటువంటి స్థితిలో వారికి ఏం చేయాలో తోచలేదు. వెంటనే వారు అధికారులను సమాచారం ఇచ్చారు. వారు స్పందించి వీరభద్రవరం, పాత్రాపురం మీదుగా గర్భిణులను ట్రాక్టర్, పడవల సహాయంతో గోదావరి ముంపు ప్రవాహాన్ని దాటించి వారిని వెంకటాపురం ఆస్పపత్రికి తరలించారు.

ఇది ఇలావుండగా, గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దపల్లి జిల్లా మంథని వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. గోదావరి వరద పోటెత్తడంతో గౌతమేశ్వరస్వామి ఆలయం చుట్టూ భారీ స్థాయిలో ప్రవహిస్తోంది. శ్రీ గౌతమేశ్వర స్వామి దేవాలయంలో 20 మంది అక్కడే చిక్కుకున్నారు. అనేక సంవత్సరాలుగా పూజలు నిర్వహిస్తూ అర్చకులు, సహాయకులు అక్కడే నివాసముంటున్నారు.
వర్షా కాలంలో ప్రతి ఏడాది వరదలు వచ్చినప్పటికీ.. ఈ ఏడాది భారీగా వరదలు ఆలయాన్ని చుట్టుముట్టడంతో విద్యుత్, రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. గత రెండు రోజులుగా వరద నీరు అంతకంతకు అమాంతంగా పెరుగుతుండడంతో అక్కడివారు భయభ్రాంతులకు గురవుతున్నామని తెలిపారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వేడుకుంటున్నారు. ఓ వైపు గోదావరి, మరోవైపు బొక్కలవాగు పొంగిపొర్లుతుండటంతో మంథనితోపాటు పరిసర గ్రామాలు కూడా నీట మునిగాయి. దీంతో ముంపు ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. రహదారులపైకి భారీగా వదర నీరు చేరుకోవడంతో రాకపోకలు కూడా నిలిచిపోయాయి.












Click it and Unblock the Notifications