ఇకపై విద్యాసంస్థల్లో అలాంటివి చేయడం నిషేధం.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో సినిమా ప్రొమోషన్స్ కు చెక్ పెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు విద్యార్థుల భద్రత, పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీల్లో విద్యా వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు సిద్ధం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు సినిమాను విపరీతంగా ఆదరిస్తారన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలి కాలంలో విద్యాసంస్థల్లోనూ సినిమా ప్రొమోషన్స్ పెరిగిపోయాయి. అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పాఠశాలల్లోకి వెళ్లి మరీ తమకు ఓట్ వేయాలని ప్రొమోషన్స్ చేయడం ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇకపై విద్యాసంస్థల్లో సినిమా, ఇతర ప్రైవేటు కార్యక్రమాల ప్రమోషన్లపై నిషేధం విధించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.
తెలంగాణలో కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీలు, కాలేజీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై విద్యా సంస్థలకు సంబంధించిన క్యాంపస్ లలో సినిమా ప్రమోషన్లు, ప్రైవేట్ ఈవెంట్ల నిర్వహణపై నిషేధం విధించే దిశగా తెలంగాణ ప్రభుత్వం తీవ్రమైన కసరత్తు చేస్తోంది. విద్యా క్యాంపస్ లలో కేవలం విద్య, సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలకే అనుమతి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సినిమా రిలీజ్ రోజున ఏకంగా సెలవును ప్రకటిస్తూ కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీలు ఉత్తర్వులు ఇవ్వడంపై తీవ్రస్థాయిలో మండిపడినట్లు తెలుస్తోంది.

మరోవైపు ఇటీవల హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజ్ లో దసరా పండగ సందర్బంగా ఏర్పాటు చేసిన దాండియా వేడుకల్లో అపశృతి జరిగి ఇద్దరు విద్యార్థినులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇకపై విద్యా సంస్థల్లో ఏదైనా భారీ ఈవెంట్ ను నిర్వహించాలంటే విద్యాశాఖతో పాటు పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే స్టేజీ నిర్మాణం, ఫైర్ సేఫ్టీతోపాటు విద్యార్థుల రక్షణకు సంబంధించిన ప్రత్యేక భద్రతా మార్గదర్శకాలను విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇందుకు సంబంధించిన విధి విధానాలను త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది.












Click it and Unblock the Notifications
