తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు ముఖ్య గమనిక. మార్చిలో జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజుకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రభుత్వ పరీక్షల విభాగం గురువారం విడుదల చేసింది. నవంబర్ 17లోగా విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాలని తెలిపింది. రూ. 50 ఆలస్య రుసుంతో డిసెంబర్ 1 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.
అలాగే, రూ. 200 ఆలస్య రుసుంతో డిసెంబర్ 11, రూ. 500 ఆలస్య రుసుంతో డిసెంబర్ 20 వరకు చెల్లించుకోవచ్చని అధికారులు తెలిపారు. రెగ్యూలర్ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు కలిపి రూ. 125 చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో పది చదువుతున్న విద్యార్థుల నుంచి వార్షిక పరీక్షల ఫీజు వసూళ్లు చేయాలని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు.

జేఈఈ మెయిన్ దరఖాస్తులు ప్రారంభం
దేశంలోని ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజినీరింగ్ సంస్థల్లో ప్రవేశాలకోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (JEE Main- 2024) దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. బుధవారంతో ప్రారంభమైన ఆన్‌లైన్ దరఖాస్తు గడువు నవంబర్ 30న రాత్రి 9 గంటలకు ముగియనుంది. ఈ పరీక్షలను రెండు విడతలుగా నిర్వహించనున్నారు. 2024 జనవరిలో మొదటి సెషన్, ఏప్రిల్‌లో రెండో విడత పరీక్షలు జరుగనున్నాయి.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో (CBT) పరీక్షలు ఉంటాయి. ఈ మేరకు జనవరి సెషన్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. తెలుగుతోపాటు ఇంగ్లిష్, హిందీ సహా మొత్తం 13 భాషల్లో పరీక్ష నిర్వహిస్తున్నట్టు వెల్లడించింది. జేఈఈ మెయిన్‌లో రెండు పేపర్లు ఉంటాయి. బీఈ (BE), బీటెక్ (B.Tech) కోర్సుల కోసం పేపర్-1, బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల కోసం పేపర్-2 నిర్వహిస్తారు. కాగా, పరీక్షలను 2024 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 మధ్య నిర్వహిస్తారు. ఫలితాలను ఫిబ్రవరి 12న విడుదల చేస్తారు. సంప్రదించాల్సిన వెబ్‌సైట్: www.nta.ac.in, https://jeemain.nta.ac.in/.












Click it and Unblock the Notifications