జమ్మూ కాశ్మీర్ వరదల్లో తెలంగాణ టెక్కీ
కరీంనగర్: విహార యాత్రకు వెళ్లిన తెలంగాణకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఒకతను తన మిత్రులతో పాటు జమ్మూ కాశ్మీర్ వరదల్లో చిక్కుకున్నాడు. అయితే, వారంతా సురక్షితంగా ఉన్నారు. వారిని అధికారులు సురక్షితంగా శ్రీనగర్‌లోని రాజభవన్‌కు తరలించారు.
కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేటకు చెందిన సురభి వనజ, రామారావు దంపతుల కుమారుడు వంశీకృష్ణ మూడేళ్లుగా హైదరాబాదులోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. ఈ నెల 4వ తేదీన తన ముగ్గురు మిత్రులు బాలకృష్ణ, గోపి, మరొకతనితో కలిసి విహార యాత్రకు వెళ్లాడు.

యాత్రలో భాగంగా వంశీకృష్ణ మిత్రబృందం జమ్మూ కాశ్మీర్‌లో తిరుగుతుండగా భారీ వర్షాలతో వరదలు వచ్చాయి. దీంతో అక్కడ ఉన్నవారితో పాటు వంశీకృష్ణ, అతని మిత్రులు వరదల్లో చిక్కున్నారు. వారిని అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించారు.
తమను రెండు మూడు రోజుల్లో హైదరాబాదు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు వంశీకృష్ణ ఫోన్‌లో కుటుంబ సభ్యులకు చెప్పాడు. కుమారుడు క్షేమంగా తిరిగి రావాలని దేవుడిని తల్లి ప్రార్థిస్తోంది.












Click it and Unblock the Notifications