తెలంగాణలో కొత్త రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు అనేక విప్లవాత్మక చర్యలను తీసుకుంటోంది. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 1.55 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వచ్చే నెల నుంచి వారికి సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రక్రియ సాగుతోంది. రాష్ట్రంలోని పేద బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందించే విధంగా రాష్ట్రవ్యాప్తంగా 1.55 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. అర్హులైన లబ్ధిదారుల వివరాలు ఈ నెల 25వ తేదీ నుంచి మొబైల్ ఫోన్ లకు మెసేజ్ లు వస్తాయని పౌరసరఫరాల శాఖ పేర్కొంది. వచ్చే నెల నుంచి వారికి సన్న బియ్యం పంపిణీ చేపట్టనుంది.
కొత్తగా మంజూరైనవారికి మే 25 నుంచి మొబైల్ లకు మెసేజ్ లు వస్తాయని పౌర సరఫరాల శాఖ పేర్కొంది. కొత్త రేషన్ కార్డుదారులకు వచ్చే నెల సన్నబియ్యం పంపిణీ ఉంటుందని స్పష్టం చేసింది. గ్రామ సభల ద్వారా ఎంపికైన వారికి కొత్త కార్డులు మంజూరు చేసినట్లు వివరించింది. కొత్త రేషన్ కార్డులతో కలిపి రాష్ట్రంలో 3 కోట్ల మంది రేషన్ లబ్దిదారులుగా ఉన్నారు. వీరికి నెలకు 1.89 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమని ప్రభుత్వం అభిప్రాయపడింది.

మరోవైపు ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో ఉచిత సన్నబియ్యం పథకం ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ పథకం కింద రాష్ట్రంలోని పేద కుటుంబాల్లోని ఒక్కో వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఒక కుటుంబంలో గరిష్టంగా ఆరుగురు వ్యక్తులకు 6 కిలోల చొప్పున నెలకు 36 కిలోల సన్న బియ్యం అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇక అన్ని రాష్ట్రాల్లో మూడు నెలల రేషన్ ఒకేసారి ఇవ్వాలని కేంద్ర ఆహార ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాహుల్ సింగ్.. అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు. వర్షాకాలంలో రేషన్ రవాణా ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితుల్లో, అన్ని రాష్ట్రాల్లో మూడు నెలల రేషన్ ఒకేసారి ఇవ్వాలని, వర్షాకాలం ముందే ఈ చర్య తీసుకుంటున్నట్టు లేఖలో పేర్కొన్నారు.
అయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని సామాన్య ప్రజలు, తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తోంది ప్రభుత్వం. మే నెలలో ఇవ్వాల్సిన రేషన్ కోటాను ఇప్పటికే ఇచ్చేసింది. ఇక జూన్ లో మూడు నెలల కోటాను ఒకేసారి విడుదల చేస్తామని రాష్ట్రప్రభుత్వం కేంద్రప్రభుత్వానికి వివరించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications