Mahashivaratri: భక్తులతో రద్దీగా మారిన ఆలయాలు..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శైవక్షేత్రాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతోంది. ఉదయం నుంచే భక్తులు ఆలయాల్లో పరమేశ్వరుడి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. శివరాత్రి తర్వాత రోజులు భక్తులు ఉపవాసం విడుస్తారు. స్వామి వారి దర్శనం అనంతరం ఆహారం తీసుకుంటున్నారు. వేములవాడలో రాజన్న ఆలయంలో ఉదయం నుంచే భక్తులు రద్దీ కొనసాగుతోంది.
స్వామి వారి దర్శనం కోసం బారులు తీరారు. రాజన్న సన్నిధిలో కోడె మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. జాగారం సందర్భంగా గుడి చెరువు స్థలంలో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలతో భక్తులు భక్తి పారవస్యంలో మునిగిపోయారు. అటు జగిత్యాల జిల్లా దుబ్బ రాజన్న సన్నిధిలో భక్తులు రద్దీ కొనసాగుతోంది. కోరుట్ల, మెట్ పల్లి పట్టణాల్లో శివాలయాలకు ఉదయం నుంచే భక్తులు తరలొస్తున్నారు.

గోదావరిఖని జనగామలో పురాతన త్రిలింగేశ్వరాలయంతో పాటు కోదండరామాలయం, ఐబీ కాలనీ శివాలయం, బసంత్‌నగర్ సమీపంలోని బుగ్గ రాజరాజేశ్వరాలయంలో స్థానిక ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ దంపతులు పూజలు నిర్వహించారు. హుజూరాబాద్ మండలంలోని సిర్సపల్లి, బోర్నపల్లి గ్రామాల్లోని శివాలయాల్లో శివరాత్రి పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
రాయికల్ మండలం కొత్తపేట శ్రీ రాజరాజేశ్వరస్వామి నాగాలయంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆలయంలో పూజలు నిర్వహించారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గంగాధర మండలం కొండన్నపల్లి సహస్ర లింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ ప్రాంగణంలోని రామలింగేశ్వర ఆలయం, కనగర్తి గ్రామంలోని శివాలయంలో శివపార్వతుల కల్యాణం నిర్వహించారు.












Click it and Unblock the Notifications