బీజేపీ కార్యకర్త ఆత్మహత్యతో ఖమ్మంలో ఉద్రిక్తత; మంత్రి పువ్వాడనే కారణమన్న బండి సంజయ్
ఖమ్మం జిల్లాకు చెందిన బిజెపి కార్యకర్త ఆత్మహత్య చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. బీజేపీ శ్రేణుల పై పోలీసులు కేసులు పెట్టి వేధించడంతో బిజెపి కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని బిజెపి నాయకులు మండిపడుతున్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బరితెగింపు వల్లే, పోలీసులు బీజేపీ కార్యకర్తలను వేధింపులకు గురి చేశారని మండిపడుతున్నారు.

ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సూసైడ్.. ఖమ్మంలో ఉద్రిక్తత
ఇక అసలు విషయానికి వస్తే బిజెపి మజ్దూర్ యూనియన్ సెల్ జిల్లా కన్వీనర్ గా సాయి గణేష్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. ఇటీవల కాలంలో బీజేపీ కార్యకర్తలపై టిఆర్ఎస్ ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తోంది. ఈ క్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ ఒత్తిడితో బీజేపీ శ్రేణులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుల విషయంలో ఒత్తిడితో ఈనెల 14వ తేదీన సాయిగణేష్ అనే కార్యకర్త పోలీస్ స్టేషన్ లోనే ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశాడు. వెంటనే అతనిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి సీరియస్ గా ఉండటంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయి గణేష్ శనివారం నాడు మరణించాడు. దీంతో ఖమ్మంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

మంత్రి, పోలీసుల వేధింపుల వల్లే సాయి గణేష్ సూసైడ్: బండి సంజయ్
బిజెపి కార్యకర్త సాయి గణేష్ మృతితో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ క్యాంపు కార్యాలయం, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఖమ్మం తరలి వస్తున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఈ ఘటనపై స్పందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సాయి గణేష్ పై 16 కేసులు పెట్టారని, బిజెపి కార్యకర్త కాబట్టే పిడియాక్ట్ పెట్టారని విమర్శించారు. మంత్రి, పోలీసుల వేధింపుల వల్లే సాయి గణేష్ మరణించాడని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విరుచుకుపడ్డారు.

మంత్రి పువ్వాడ బలుపెక్కి, బారి తెగిస్తున్నాడు: బండి సంజయ్ ధ్వజం
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బలుపెక్కి, బరితెగించారని బండి సంజయ్ మండిపడ్డారు. మంత్రి అవినీతిని సాయి గణేష్ ప్రశ్నించారని, అందుకే అతనిని వేధింపులకు గురి చేశారంటూ బండి సంజయ్ పేర్కొన్నారు. ఇది మంత్రి పువ్వాడ, పోలీసులు చేసిన హత్య అని పేర్కొన్న బండి సంజయ్ సాయి గణేష్ మరణానికి బాధ్యత వారే వహించాలి అంటూ డిమాండ్ చేశారు. సాయి గణేష్ ఆత్మ హత్యకు కారకులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

ఖమ్మం ఏసీపీ కార్యాలయం వద్ద బీజేపీ నేతల ధర్నా
ఇదిలా ఉంటే పోలీసులు వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన సాయిగణేష్ మృతిచెందిన నేపధ్యంలో అతని ఆత్మ హత్యకు కారకులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బిజెపి నేతలు ఖమ్మం ఏసీపీ కార్యాలయానికి చేరుకుని ధర్నా చేశారు. అంతే కాదు ఈ నెల 18వ తేదీన ఖమ్మం లో కేటీఆర్ పర్యటన ను అడ్డుకుంటామని బిజెపి నేతలు చెబుతున్నారు. స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఒత్తిడితోనే పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని బీజేపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు.












Click it and Unblock the Notifications