ఇళ్ల స్థలాలకు పాస్ పుస్తకాలు - దక్కేదెవరికి..!!
తెలంగాణలో కొత్త ఆర్వోర్ చట్టం అందుబాటులోకి రానుంది. ఈ చట్టం ద్వారా గ్రామ స్థాయిలో భూ రికార్డుల నిర్వహణ లో కీలక మార్పులు జరగనున్నాయి. అదే విధంగా సాదాబైనామా దరఖాస్తులకూ పరిష్కారం లభించనుంది. హక్కు పత్రాలను జారీ చేసే అధికారాలను ఆర్డీవోలకు కట్టబెడతారు. భూములకు విశిష్ట సంఖ్య- భూధార్ కేటాయింపు జరిగితే.. దేశంలోనే ఈ ఘనత సాధించిన రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందుతుంది.
కొత్త ఆర్వోర్ చట్టం అమలు ద్వారా భూ రికార్డుల నిర్వహణలో గ్రామ స్థాయిలో పూర్తి పారదర్శకత వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ చట్టం ద్వారా గ్రామాల్లో ఉన్న ఇళ్ల స్థలాలకు కూడా ప్రభుత్వం హక్కుపత్రాలను ఇస్తుంది. అంటే.. వ్యవసాయ భూములకు మాదిరిగానే ఇళ్ల స్థలాలకు కూడా పాస్ పుస్తకాలు జారీ అవుతాయి. ఈ నిర్ణయం వల్ల 10,894 గ్రామాల్లోని ఇళ్ల స్థలాల యజమానులకు ప్రయోజనం చేకూరనుంది. పాత సమస్యలకు పరిష్కారం లభించనుంది.

అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో 9.24 లక్షల సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కొత్త ఆర్వోఆర్ ప్రకారం ఈ దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటారు. వాటిపై క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతారు. ఆ భూములు అసైన్డ్, సీలింగ్ చట్టాల పరిధిలో లేకుంటే.. వాటికి హక్కుపత్రాలను జారీ చేస్తారు. ఈ అధికారం ఆర్డీవోకు ఉంటుంది. 1989 నుంచి 2016 వరకు సాదాబైనామా దరఖాస్తులకు తహసీల్దార్లు హక్కుపత్రాలను జారీ చేసేవారు. కొత్త చట్టం ప్రకారం ఆ అధికారాలు ఆర్డీవోలకు దక్కనున్నాయి.
భూమి మీద 18 రకాలుగా హక్కులు కల్పించేలా కొత్త ఆర్వోఆర్ అవకాశం కల్పిస్తోంది. సెక్షన్2(12), 5, 7, 8 సెక్షన్ల ప్రకారం భూమిని మూడు కేటగిరీలుగా విభజించి, హక్కులు కల్పిస్తారు. సెక్షన్-5 ప్రకారం భూమి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌లో అభ్యంతరాలుంటే.. మ్యుటేషన్‌ను నిలిపివేసే అవకాశాన్ని అధికారులకు కల్పించారు. అయితే.. మ్యుటేషన్‌ను నిలిపివేసే అధికారులు అందుకు తగ్గ కారణాలను లిఖతపూర్వకంగా స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. కొత్త ఆర్వోఆర్ ప్రకారం ప్రభుత్వం మూడు దశల్లో ధరణి పోర్టల్‌లో ఉన్న లోపాలను సవరించనుంది. భూ సమస్యలను కూడా మూడంచెల్లో పరిష్కరించనుంది. ధరణిలో గుర్తించిన 45 రకాల సమస్యలకు పరిష్కారం లభించనుంది.












Click it and Unblock the Notifications