హైదరాబాద్ లో ఆ ప్రాంతంలో ఎకరా భూమి రూ 269 కోట్లు - ఆల్ టైం రికార్డు..!!
హైదరాబాద్ లో భూముల ధరలు కొత్త రికార్డు నెలకొల్పుతున్నాయి. ఐటీ కారిడార్‌లో తాజా వేలంలో పలికిన ధర అందరిలో ఆశ్చర్యానికి కారణమైంది. రాయదుర్గంలో తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) నిర్వహించిన ఆన్‌లైన్ వేలంలో ఎకరం ధర ఏకంగా రూ. 269 కోట్లు పలికింది. ప్రముఖ నిర్మాణ సంస్థ వంశీరాం బిల్డర్స్ ఈ భూమిని అత్యధిక ధరకు దక్కించుకుంది.
హైదరాబాద్ నగరంలో భూముల ధరలు సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) నిర్వహిస్తున్న భూముల వేలం పాటల్లో భూమికి రికార్డు ధర పలికింది. రాయదుర్గంలో ప్రాంతంలోని అత్యంత విలువైన స్థలాల వేలంలో ఎకరం ఏకంగా రూ. 269 కోట్లకు బిడ్ దక్కింది. రాయదుర్గంలోని 5.38 ఎకరాల ప్లాట్ కోసం నిర్వహించిన ఈ-వేలంలో ఎకరానికి రూ.269 కోట్ల చొప్పున బిడ్ లభించింది. దీంతో ఆ ప్లాట్ మొత్తం విలువ సుమారు రూ.1,447.22 కోట్లకు చేరింది. హైదరాబాద్ లోని కీలక ఐటీ ప్రాంతాల్లో భూములకు ఉన్న భారీ డిమాండ్ ఏంటో ఈ వేలంతో స్పష్టం అవుతోంది. గత వారం నిర్వహించిన ప్లాట్-పీ1 వేలం కూడా అత్యంత భారీ ధరను నమోదు చేసింది. 5.25 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ ప్లాట్ ఎకరాకు రూ.264 కోట్ల ధర పలకగా.. మొత్తం రూ. 1,386 కోట్ల ఆదాయం వచ్చింది.

కోట్లలో పలుకుతున్న భూముల ధరలు
కాగా, ఇందులో వేలం విలువలో 25శాతం మొత్తాన్ని తొలి దశ చెల్లింపుగా ఇప్పటికే ప్రభుత్వం అందుకుంది. తాజాగా నిర్వహించిన పీ2 వేలం ఫలితాన్ని, గత వారం పీ1 ఫలితాన్ని కలిపి చూస్తే.. కేవలం 10.63 ఎకరాల భూమి ద్వారా టీజీఐఐసీకి ఏకంగా రూ. 2,833.22 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ రెండు వేలాల్లో ఎకరాకు సగటున రూ.266.53 కోట్ల ధర లభించడం విశేషం. ఐటీ, బిజినెస్ సంస్థలు రాయదుర్గం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిసర ప్రాంతాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో భూముల ధరలు భారీగా పెరుగుతున్నాయని రియల్ ఎస్టేట్ వ్యాపారులు పేర్కొంటున్నారు. ఐటీ హబ్, గచ్చిబౌలి, నాలెడ్జ్ సిటీ వంటి కీలక ప్రాంతాలకు అత్యంత సమీపంలో ఉండటంతో ఇక్కడి భూములకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.













Click it and Unblock the Notifications