దసరా పండుగకు 7వేల ప్రత్యేక బస్సులు.. టీజీఎస్ ఆర్టీసీ కీలక ప్రకటన
దసరా పండగ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం దసరా పండుగకు 7వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. దసరా సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుందన్న కారణంతో బస్సుల సంఖ్యను పెంచినట్లు టీజీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. ఈ స్పెషల్ సర్వీసులకు టికెట్ ధరలను కూడా సవరించింది. సాధారణ సర్వీసులకు టికేట్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కానీ ఈ ప్రత్యేక బస్సుల్లో మాత్రం టికెట్ ధరలను పెంచినట్లు తెలంగాణ ఆర్టీసీ స్పష్టం చేసింది. హైదరాబాద్ నగరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లా కేంద్రాలకు ఈ ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది టీజీఎస్ఆర్టీసీ. ఈ క్రమంలో టికెట్ ధరలు 2003 గవర్న్ మెంట్ ఆర్డర్ ప్రకారం 1.5 టైమ్స్ వరకు పెంచింది. ఈ టికెట్ ధరలు అక్టోబర్ 9, 10, 16, 17, 25, 26 తేదీల్లో అమల్లోకి రానున్నట్లు స్పష్టం చేసింది. ఇక రెగ్యూలర్ బస్సులు నార్మల్ ధరలకే అందుబాటులో ఉంటాయని తెలంగాణ ఆర్టీసీ పేర్కొంది.
ఇక ఈ స్పెషల్ బస్సుల్లో కరీంనగర్ జోన్ నుంచి 3,533 బస్సులను నడపనున్నారు. అలాగే రీజియన్ల వారిగా చూస్తే ఆదిలాబాద్ నుంచి 431, నిజామాబాద్ నుంచి 719, కరీంనగర్ నుంచి 1,175 ఇక వరంగల్ నుంచి 530, ఖమ్మం నుంచి 678, అలాగే హైదరాబాద్ జోన్ నుంచి 2,155 బస్సులు నడుపుతున్నట్లు టీజీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది. ఇక మహబూబ్ నగర్ నుంచి 645, మెదక్ నుంచి 255, నల్గొండ నుంచి 815, రంగారెడ్డి నుంచి 440 బస్సులను నడపనున్నారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ జోన్ నుంచి 1,312 ప్రత్యేక సర్వీసులను నడపాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.

దసరా సెలవుల నేపథ్యంలో అక్టోబర్ 9, 10, 16,17 అలాగే 25, 26 తేదీల్లో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుందన్న కారణంగా ఈ మేరకు ప్రత్యేక సర్వీసులను తెలంగాణ ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ లో స్పెషల్ బస్సులు మేజర్ పాయింట్స్ అయిన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఆరాంఘార్, ఎల్బీ నగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్ బీ, బోయినపల్లి, గచ్చిబౌలి ప్రాంతాల నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు టీజీఎస్ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి మాట్లాడుతూ ఈ స్పెషల్ బస్సుల్లోనూ మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని.. మహాలక్ష్మి పథకం యథావిథిగా కొనసాగుతుందని పేర్కొన్నారు. పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ సేవలతోపాటు స్పెషల్ సర్వీసులకూ ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 లలో సంప్రదించాలన్నారు.












Click it and Unblock the Notifications
