పండుగ వేళ TGSRTC 'స్పెషల్' బాదుడు - ఛార్జీలు పెంపు..!!
పండుగ వేళ ఆర్టీసీ ప్రయాణీకుల పైన భారం మోపుతోంది. రద్దీ వేళ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన ఆర్టీసీ 50 శాతం మేర అదనపు ఛార్జీలను వసూలు చేస్తోంది. వినాయక చవితి.. వరుసగా వచ్చిన సెలవులతో బస్టాండ్లు ప్రయాణీకులతో రద్దీగా మారాయి. దీంతో.. దీనిని సొమ్ము చేసుకునే విధంగా ఆర్టీసీ అదనపు ఛార్జీలను వసూలు చేస్తోంది. పండుగ రోజుల్లో ఈ రకమైన బాదుడు పైన సామాన్య ప్రయాణీకులు ఆర్టీసీ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్టీసీ పండుగ రోజుల్లో ప్రయాణీకుల పై స్పెషల్ బాదుడు మొదలు పెట్టింది. రాష్ట్రంలో ప్రత్యేక బస్సుల్లోనే మాత్రమే అదనపు చార్జీలు వసూలు చేస్తున్నామని రవాణాశాఖ కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. పండుగల వేళ సాధారణ చార్జీల కంటే గరిష్ఠంగా 1.5 రెట్లు అంటే 50 శాతం అదనంగా పెంచుకునే వెసులుబాటును 2003 నాటి జీవో నం.16 కల్పించిందని తెలిపింది. పండుగల్లో ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులతో వెళ్లినప్పటికీ, తిరుగు ప్రయాణంలో మాత్రం ఖాళీగా రావాల్సి వస్తు న్నాయని వివరించింది. నిర్వహణ ఖర్చులను భర్తీ చేసేందుకు గరిష్ఠంగా 50శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తున్నట్టు వెల్లడించింది. హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులు, ఉద్యోగులు సొంతూళ్లకు వెళ్లేందుకు బస్టాండ్లకు రావడంతో ప్రయాణికులతో కిటకిటలాడాయి. రద్దీకి అనుగుణంగా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి బస్సుల కోసం పడిగాపులు కాయాల్సి వచ్చింది.

ప్రయాణీకుల పై భారం
అయితే.. హైదరాబాద్ నుంచి జిల్లాలకు వెళ్లే పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు మహాలక్ష్మి ఉచిత ప్రయాణ సేవలు కొనసాగించారు. కాగా.. హైదరాబాద్- విజయవాడ హైవేపై శనివారం విపరీతమైన వాహన రద్దీ నెలకొంది. హైదరాబాద్ నుంచి హైవేపై మూడు వరసలుగా వచ్చే వాహనాలు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోకి చేరే సరికి రెండు వరుసలుగా మారాల్సి వస్తోంది. పట్టణంలోని హైవేపై ఫ్లై ఓవర్‌ను నిర్మిస్తుండడంతో వాహనాలను సర్వీస్ రోడ్ల వెంట పంపిస్తున్నారు. ఈ రోడ్లుపై రెండు వరుసలుగా వాహనాలు వెళ్తుండటంతో తరచూ ట్రాఫిక్‌జాం ఏర్పడుతోంది. కొన్ని సందర్భాల్లో 2-3 కి.మీ. పొడవునా వాహనాలు నిలిచిపోతు న్నాయి. అలాగే, కరీంనగర్, విజయవాడ, మేడ్చల్, సంగారెడ్డికి వెళ్లే ప్రధాన రహదారుల్లో వాహనాల సంఖ్య పెరగడంతో శివారు ప్రాంతాల్లో అనేక చోట్ల ట్రాఫిక్ స్తంభించటం తో వాహన దారులు ఇబ్బందులు పడ్డారు.












Click it and Unblock the Notifications
