ఆర్టీసీలో 1,500 కండక్టర్ పోస్టులు భర్తీపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన
టీజీఎస్ఆర్టీసీలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆర్టీసీలో 1,500 కండక్టర్ పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు. అలాగే దాదాపు 4 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా చివరిదశలో ఉందని పేర్కొన్నారు. ఈ విధంగా రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలను పెంచడం ద్వారా యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వెల్లడించారు.
ప్రజా ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించేందుకు పెద్దపీట వేసిందని అన్నారు. ఆ దిశగా రవాణా సంస్థలో మరిన్ని మార్పులు తెస్తున్నామని అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు, ప్రయాణికులకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. త్వరలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఇక నిత్యం 65 లక్షల మందికిపైగా ఆర్టీసీ సేవలు సద్వినియోగం చేసుకుంటున్నారని తెలిపారు.

ఈ మేరకు రవాణా సంస్థలో మరిన్ని మార్పులు తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామని ఇప్పటి వరకు 347.36 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని అన్నారు. ఈ మేరకు రూ. 12,167 కోట్లు ఆదా చేసుకున్నారని తెలిపారు. ఇక కొత్తగా 2,932 కొత్త బస్సులు కొనుగోలు చేశామని.. 1,024 ఎలక్ట్రిక్ బస్సులు విజయవంతంగా నడుస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. అలాగే హైదరాబాద్ నగరంలో కొత్తగా మరో 2,200 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కబోతున్నాయని తెలిపారు.












Click it and Unblock the Notifications