తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సామాన్యుని విజయం...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి అవకాశం దక్కించుకున్న వారు చాలామందే ఉన్నారు. రాజకీయాల్లో సామాన్యులు రాణించడమంటే ప్రస్తుత పరిస్థితుల్లో చాలా కష్టం. కానీ, ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఓ సామాన్యుడు సత్తా చాటాడు. ఎలాంటి పొలిటికల్ బ్యాగ్రౌండ్ లేకపోయినా ప్రజల ఆశీస్సులతో అసెంబ్లీకి అడుగుపెట్టబోతున్నాడు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్ విజయపతాకాన్ని ఎగురవేసింది. ఈ ఎన్నికల్లో ఈసారి నిర్మల్ జిల్లా ఖానాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వెడ్మా బొజ్జు పటేల్ పోటీచేసి పెద్ద పెద్ద రాజకీయ నాయకులనే మట్టికరిపించారు. అనూహ్య రీతిలో విజయాన్ని వరించారు. ఈ నియోజకవర్గంలో బిజెపి నుంచి మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, బీఆర్ఎస్ నుంచి ఎన్నారై, కేటీఆర్ ఫ్రెండ్ భూక్యా జాన్సన్‌లతో పోటీపడ్డారు.అయితే, ఈ స్థానం మాత్రం బొజ్జు పటేల్‌నే వరించింది.

నిరుపేద ఆదీవాసి కుటుంబం నుంచి వచ్చిన బొజ్జు పటేల్..
వెడ్మ బొజ్జు ఒక సామాన్య స్థాయి నుంచి వచ్చారు. ఈయన ఆదివాసీ గోండు బిడ్డ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు మండలం కల్లూర్‌గూడకు చెందినవాడు. ఈయన తల్లిదండ్రులు వెడ్మ భీంరావు, గిరిజాబాయిలు నిరుపేద ఆదివాసీలు. వీరి పెద్ద కుమారుడే వెడ్మబొజ్జు పటేల్. ఇప్పటికీ ఈయన కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన ఇందిరమ్మ ఇంట్లోనే నివాసముండం విశేషం..
చదువుకునే సమయంలో బొజ్జు పేపర్ బాయ్‌గాను పని చేశారు. వెడ్మబొజ్జు పటేల్ పీజీ వరకు చదివారు. చదువుకునే సమయంలోనే విద్యార్ధి సంఘంలో ఎంతో చురుకుగా ఉండేవారు. ఆ తర్వాత ఆదివాసీ హక్కుల పోరాట సమితిలో సలహాదారుడిగా చేశారు. అనంతరం కుటుంబ పోషణ కోసం కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేశారు. రెండేళ్ల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టిని ఆకర్షించి ఖానాపూర్ టికెట్ దక్కించుకుని ఇప్పడు విజయపతాకాన్ని ఎగురవేశారు. అయితే, బొజ్జు నామినేషన్‌లో తనకు రూ.8.42 లక్షలు అప్పులున్నాయని పేర్కొన్నారు. తాను ఉమ్మడి ఏపీలో ఇందిరమ్మ పథకం కింద వచ్చిన ఇంట్లోనే నివాసం ఉంటున్నట్లు వివరించారు.












Click it and Unblock the Notifications