బెటాలియన్ కానిస్టేబుళ్లకు ఊరట: మహిళల ఆందోళనల ఎఫెక్ట్
కానిస్టేబుళ్ల కుటుంబసభ్యుల ఆందోళనల నేపథ్యంలో బెటాలియన్ కానిస్టేబుళ్ల సెలవులు రద్దు నిర్ణయాన్ని పోలీసు శాఖ తాత్కాలికంగా వాయిదా వేసింది. ఒకే పోలీసు విధానం ఉండాలని.. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రంలో ఉన్న విధానాన్ని అమలు చేయాలని కానిస్టేబుళ్ల కుటుంబసభ్యులు గత రెండు రోజులుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో బాగంగానే శుక్రవారం సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని అక్కడ్నుంచి తరలించారు. తమ భర్తలతో పోలీసు విధులు కాకుండా.. కూలి పనులు చేయిస్తున్నారని కుటుంబసభ్యులు ప్రధానంగా ఆరోపణలు చేశారు.

పోలీసు విధులకు, వాళ్లు చేస్తున్న పనికి సంబంధం లేదని, పండగలకు కూడా ఇంటికి రాకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏక్ పోలీస్ విధానాన్ని అమలుచేసి తమ భర్తలకు ఒకే దగ్గర డ్యూటీ చేసే అవకాశం కల్పించాలని కానిస్టేబుళ్ల భార్యలు డిమాండ్ చేశారు. అది అమలయ్యే వరకు మెస్ తీసివేసి ఒకే దగ్గర 3 నుంచి 5 పోస్టింగ్ ఇవ్వాలని కోరారు.
ఒకే నోటిఫికేషన్, ఒకే పరీక్ష పెట్టినప్పుడు అందరికి ఒకేలా ఉద్యోగం ఉండాలి, కానీ, తమ భర్తలకే ఎందుకు కుటుంబాలకు దూరంగా ఉండే విధంగా ఉందని ప్రశ్నించారు. బెటాలియన్ కానిస్టేబుళ్లను కూలీలకంటే దారుణంగా చూస్తున్నారని కానిస్టేబుళ్ల కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మట్టి, ఇటుకలు మోపిస్తున్నారని, గడ్డి తీసే పనులు చెప్తున్నారని వాపోయారు.
రిక్రూట్మెంట్ విధానంలో ప్రత్యేక బలగాలుగా కొంతమంది ఉద్యోగులను తీసుకుంటారని, బెటాలియన్ల ఉద్యోగాలు చేయడం వల్ల తమ కుటుంబాలకు దూరమవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. భారీ సంఖ్యలో వచ్చిన బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.
ఈ నేపథ్యంలోనే సెలవులు రద్దు చేస్తూ గతంలో జారీ చేసిన ఆదేశాలను పోలీసు శాఖ తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తెలిపింది. ఈ అంశంపై కానిస్టేబుళ్ల కుటుంబసభ్యులతో చర్చించాలని నిర్ణయించింది.












Click it and Unblock the Notifications