తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజులపాటు ‘ఫిష్ ఫుడ్ ఫెస్టివల్’: ప్రత్యేక వంటకాలు
హైదరాబాద్: మృగశిర కార్తె సందర్భంగా జూన్ 8, 9, 10 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 'ఫిష్ ఫుడ్ పెస్టివల్'ను నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహణ, ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో మంత్రి తలసాని బుధవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.అన్ని జిల్లా కేంద్రాల్లో అందుబాటులో ఉండాల్సిన చేప ఉత్పత్తులు, వంటకాలపై విస్తృతంగా చర్చించారు. ఫెస్టివల్ నిర్వహణకు అనువైన ప్రాంతాలు గుర్తించి ఏర్పాట్లు చేయాలని అధికారులను తలసాని ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఈ ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ లో చేపలతో తయారు చేసిన ఫిష్ ఫ్రై(Fish Fry), కర్రీ(Curry), బిర్యానీ(Biryani) వంటి అన్ని రకాల వంటకాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో నిర్వహించే ఫెస్టివల్ లో 20 నుంచి ౩౦ వరకు వివిధ రకాల చేప వంటకాల స్టాల్స్ ఉండే విధంగా చూడాలని ఆదేశించారు. ప్రతి చోట విజయ డెయిరీ ఉత్పత్తులతో కూడిన స్టాల్ ను కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభానికి ఆయా జిల్లాలకు చెందిన మంత్రిని , ఇతర ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని తలసాని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించే విధంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు.ఫెస్టివల్ కు వచ్చే వినియోగదారులకు ఆహ్లాదాన్ని పంచే విధంగా మూడు రోజులపాటు సాంస్కృతిక కార్యక్రమాలనునిర్వహించాలన్నారు.
రాష్ట్ర పండుగను తలపించే విధంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని, ఇందుకోసం పశుసంవర్ధక, మత్స్య, డెయిరీ అధికారులతో పాటు గోపాలమిత్ర లకు కూడా భాగస్వాములను చేయాలన్నారు మంత్రి తలసాని. అంతేగాక, మత్స్యరంగానికి విశేష సేవలు అందించిన వారిని గుర్తించి సన్మానించాలని తెలిపారు.
నూతనంగా లక్ష మందికి మత్స్య సొసైటీ లలో సభ్యత్వాలు కల్పించే విధంగా స్పెషల్ డ్రైవ్ ను నిర్వహిస్తున్నామని వివరించారు. ఇది ఇలావుండగా, నూతనంగా మత్స్య సహకార సంఘాల సొసైటీ చైర్మన్‌గా నియమితులైన పిట్టల రవీందర్ మంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.












Click it and Unblock the Notifications