Mohan Babu: మరో ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు-ఎందుకు కొట్టానంటే ?
తన కుమారుడు మంచు మనోజ్ తో విభేదాల నేపథ్యంలో జల్ పల్లిలోని తన ఇంటి వద్ద జర్నలిస్టుపై దాడి చేసి గాయపర్చిన ఘటనపై టాలీవుడ్ నటుడు మంచు మోహన్ బాబు స్పందించారు. ఆ రోజు తన ఇంటి వద్ద చోటు చేసుుకున్న పరిణామాల్ని వివరిస్తూ తాను ఎందుకు సదరు జర్నలిస్టుపై దాడి చేయాల్సి వచ్చిందో వివరిస్తూ ఈ ఆడియో విడుదల చేశారు. గతంలో తన కుమారుడు మంచు మనోజ్ ను ఉద్దేశించి ఆడియో విడుదల చేసిన మోహన్ బాబు.. ఇవాళ జర్నలిస్టుపై దాడి ఘటనపై వివరణతో ఈ ఆడియో రిలీజ్ చేశారు.

విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుపై అతని ఛానల్ లోగో మైక్ తీసుకుని దాడికి దిగిన ఘటనపై మోహన్ బాబు విచారం వ్యక్తం చేశారు. తన ఇంట్లోకి దూసుకొచ్చింది జర్నలిస్టులా కాదా అన్న విషయం తనకు తెలియదన్నారు. తమ కుటుంబ సమస్యల్లో ఎవరైనా జోక్యం చేసుకోవచ్చా అని మోహన్ బాబు ఈ ఆడియోలో ప్రశ్నించారు. దైవసాక్షిగా రిపోర్టర్ పై దాడి చేయాలనుకోలేదన్నారు. మీడియాను అడ్డుపెట్టుకుని కొందరు తనపై దాడి చేసి అవకాశం ఉందని భావించినట్లు తెలిపారు.
తాను చీకట్లో చేసిన దాడి కారణంగా జర్నలిస్టుకు దెబ్బలు తగిలాయని మోహన్ బాబు తెలిపారు. రిపోర్టర్ కు తగిలిన దెబ్బపై తాను బాధపడుతున్నట్లు తెలిపారు. అతను తనకు తమ్ముడి లాంటి వాడన్నారు. అతని భార్యా పిల్లల గురించి ఆలోచిస్తున్నట్లు మోహన్ బాబు తెలిపారు. తాను సినిమాల్లోనే నటిస్తానని, బయట నటించాల్సిన అవసరం లేదని తెలిపారు. తన ధైర్యం సాహసమే అని, నీతిగా బతకాలనే తన ఆలోచన అన్నారు. తాను గేటు బయట అసభ్యంగా ప్రవరించి కొట్టి ఉంటే 50 కేసులు పెట్టుకోవచ్చని, అరెస్టు కూడా చేసుకోవచ్చని తెలిపారు. కానీ తన ఇంట్లోకి వచ్చి తన ప్రశాంతత భగ్నం చేశారన్నారు.
తన బిడ్డే తన ప్రశాంతత చెడగొడుతున్నాడని మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. తాము కూర్చుని మాట్లాడుకుంటామని, ఏదో ఒక రోజు సమస్యలు పరిష్కారం అయిపోతాయని తెలిపారు. అందుకు మధ్యవర్తులు అవసరం లేదన్నారు. తాను చేసినా సేవా కార్యక్రమాలు మర్చిపోయి దాడి ఘటననే పెద్దదిచేసి చూపుతున్నారని ఆరోపించారు. తాను కొట్టిన విషయం తప్పేనని, కానీ అక్కడ సందర్భం కూడా ఆలోచించాలని కోరారు. మీకు టీవీలు ఉండొచ్చని, తాను కూడా రేపు టీవీ పెడతానని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications