టీఆర్ఎస్‌కు మరో షాక్: బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి, చల్లాకు సవాల్
వరంగల్: భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. తాజాగా, టీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే బీజేపీలోకి వెళ్లనున్నారు. పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి టీఆర్ఎస్ ప్రభుత్వంపై త్వరలోనే కాషాయ కండువా కప్పుకోనున్నారు.
ఈ క్రమంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వంపై భిక్షపతి విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమకారులను టీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్టోబర్ 9వ తేదీన మెదక్ జిల్లా నర్సాపూర్‌లో కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ సమక్షంలో బీజేపీలో చేరుతున్నట్లు భిక్షపతి స్పష్టం చేశారు.
త్యాగధనుల ఫలితమే తెలంగాణ రాష్ట్రం అని ఆయన వ్యాఖ్యానించారు. సమైక్య వాది అయిన ఎర్రబెల్లి దయాకర్ రావును మంత్రి చేశారని మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి విమర్శించారు.

వీఆర్ఎస్ఏల సమస్యలను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని భిక్షపతి మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత మొలుగూరి భిక్షపతి అంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి చూపిస్తానంటూ సవాల్ విసిరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో దేశం అభివృద్ధి చెందుతోందని ప్రశంసించారు.
అయితే, సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించిన తర్వాత మాజీ ఎమ్మెల్యే పార్టీ మారడం చర్చనీయాంశంగా మారింది. కాగా, గత కొంత కాలంగా టీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్న భిక్షపతి గత రెండు రోజుల క్రితం బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను కలిశారు.
కాగా, ఇటీవల బీజేపీ కీలక నేతల సమావేశంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్‌ను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా సునీల్ బన్సల్ నేతలకు సూచించారు. మునుగోడులో రణనీతి అవలంబించాలని కేంద్ర ప్రభుత్వ పథకాలు, టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. అక్టోబర్ 7న మునుగోడు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో బీజేపీ ఆధ్వర్యంలో బైక్ యాత్రలు చేపట్టనున్నట్లు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి తెలిపారు.












Click it and Unblock the Notifications