రేవంత్ రెడ్డి తెలంగాణా పప్పు; చిప్ దొబ్బింది; మెంటల్ ఆస్పత్రిలో చేర్పించండి: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
టీపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిపై తెలంగాణ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఎమ్మెల్యేలు ఆశన్న గారి జీవన్ రెడ్డి, మాగంటి గోపీనాథ్ లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి కి చిప్ దొబ్బింది అని, వెంటనే ఆయనను ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రి లో చేర్పించాలని బాల్క సుమన్ పేర్కొన్నారు. రేవంత్ కు నాయకుడైన రాహుల్ గాంధీ అఖిలభారత పప్పు అయితే, రేవంత్ రెడ్డి తెలంగాణ పప్పుగా తయారయ్యాడని విరుచుకుపడ్డారు.

కల్లు తాగిన కోతిలా రేవంత్ రెడ్డి వ్యవహారం
పరిగిలో పిసిసి అధ్యక్షుడు కల్లు తాగిన కోతిలా వ్యవహరించాడని మండిపడ్డారు. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి విషయ పరిజ్ఞానం లేదని నిప్పులు చెరిగారు బాల్క సుమన్. తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డిని ఎవరూ పట్టించుకోలేదని ఆయన పేర్కొన్నారు. జైలులో చిప్పకూడు తిన్నాక చిప్ దొబ్బింది అని ఘాటుగా వ్యాఖ్యానించిన బాల్క సుమన్ రేవంత్ రెడ్డిని మెంటల్ ఆస్పత్రిలో చేర్పించాలని జగ్గారెడ్డికి సూచించారు. అందుకు అయ్యే ఖర్చులు తానే భరిస్తానని వెల్లడించారు.

కాంగ్రెస్ పార్టీని బీజేపీకి అమ్మే పనిలో రేవంత్
ఇక వ్యవసాయం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని, వ్యవసాయం గురించి కాంగ్రెస్ చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించడం అని బాల్క సుమన్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఓ కమెడియన్ లా మారారని, ఆయనను ఎవరూ పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి బిజెపి కోవర్ట్ అని అనుమానం కలుగుతుందని, వచ్చే ఎన్నికల సమయానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందర్నీ బయటకు పంపించి కాంగ్రెస్ ను బీజేపీకి అమ్మే పనిలో పడ్డారని రేవంత్ రెడ్డి పై నిప్పులు చెరిగారు.

రేవంత్ రెడ్డికి నిలువెల్లా విషం తప్ప విషయ పరిజ్ఞానం లేదు
కాంగ్రెస్ పార్టీ కి రేవంత్ రెడ్డి ఉరితాడుగా మారాడని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి నిలువెల్లా విషం తప్ప విషయ పరిజ్ఞానం లేదని మండిపడ్డారు. ఆయనకు నోటివెంట కుంభకోణాలు తప్ప మరో పదం రావడంలేదని విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ కోసం ట్యూటర్ని పెట్టుకుంటే మంచిదని, ఆయన బట్లర్ ఇంగ్లీష్ భాషను భరించలేక పోతున్నారని మండిపడ్డారు.

అవగాహన లేకుండా సింగరేణిపై వ్యాఖ్యలు .. సిగ్గు చేటు
ఒడిశాలో సింగరేణికి చెందిన కోల్ బ్లాక్లో 50 వేల కోట్ల కుంభకోణం జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్న బాల్క సుమన్ అసలు నైని కోల్ బ్లాక్ లో బొగ్గు విలువ అంత లేదని, సింగరేణి టర్నోవర్ ఎంతో కూడా తెలియకుండా సంస్థను విమర్శించడం సిగ్గుగా అనిపించడం లేదా అంటూ రేవంత్ రెడ్డి పై మండిపడ్డారు.సింగరేణి ప్రైవేటీకరణపై ఒక ఎంపీగా పార్లమెంట్లో మాట్లాడాల్సింది పోయి, బిజెపితో కుమ్మక్కై కెసిఆర్ ని తిడుతున్నారు అంటూ ధ్వజ మెత్తారు.

రేవంత్ రెడ్డి తెలంగాణా తాలిబన్: పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి
ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కెసిఆర్ తెలంగాణ బంధువు అయితే రేవంత్ రెడ్డి తెలంగాణ తాలిబన్ అంటూ వ్యాఖ్యలు చేశారు. పరిగిలో రేవంత్ రెడ్డి పనికిమాలిన మాటలు మాట్లాడారని, ఉనికి కోసమే రేవంత్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు కొల్లగొట్టిన పార్టీల జెండాలు మోసిన రేవంత్ ఇప్పుడు చిలక పలుకులు పలుకుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు. పిసిసి అధ్యక్షుడిగా ఆయన మనుగడ చాటుకోవడం కోసం నానా తిప్పలు పడుతున్నాడని పిఏసి చైర్మన్ ఏ. జీవన్ రెడ్డి విమర్శించారు.












Click it and Unblock the Notifications