ఈటల పై కేసీఆర్ అస్త్రం గెల్లు - ఖరారు : సామాజిక వర్గాలు ఇలా -లెక్క పక్కా : ఏంటీ వ్యూహం..!!
ఒక సస్పెన్స్ కు తెర పడింది. ఎన్నికల షెడ్యూల్ కు ముందే గులాబీ బాస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలో పోటీపడే టీఆర్‌ఎస్ అభ్యర్థిని ఖరారు చేసారు. ఈ రోజు అధికారికంగా ప్రకటించనున్నారు. టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస యాదవ్‌నే హుజూరాబాద్ అభ్యర్థిగా ఖరారు చేసారు. శ్రావణ మాసం మంచి రోజు కావడతో ఈ మేరకు నిర్ణయించారని సమాచారం.

ఉప ఎన్నిక- కేసీఆర్ వ్యూహాలు..
దళిత బంధు పథకం ప్రారంభ సమావేశ సందర్భంగా.. 16న హుజూరాబాద్‌లో నిర్వహించే బహిరంగ సభలో గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను నియోజకవర్గ ప్రజలకు సీఎం పరిచయం చేయనున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ పేరు ఖరారు వెనుక పక్కా లెక్క ఉంది. కాగా, టీఆర్‌ఎస్ ఉపఎన్నిక ఇన్‌చార్జ్, మంత్రి హరీశ్ తొలిసారిగా ఈ రోజు నియోజకవర్గానికి వెళ్లనుండటంతో భారీగా స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. హుజూరాబాద్ లో ఎలాగైనా ఈటలకు చెక్ పెట్టాలని కేసీఆర్ గట్టి పట్టుదలతో ఉన్నారు.

సామాజిక వర్గాలకు గాలం...
అందులో భాగంగా.. రకరకాల సమీకరణాలు తెర పైకి వచ్చినా..చివరకు బీసీ అభ్యర్ధి వైపే మొగ్గు చూపారు. ఈ నియోజకవర్గంలో సామాజిక వర్గాలు-వారి ఓట్లు అనుగుణంగా కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దళిత బంధు ద్వారా 45 వేల వరకున్న దళిత ఓటర్లను ప్రభావితం చేయబోతున్నారు. అలాగే గొల్ల కురుమలకు ఆర్థికంగా పరిపుష్టిని కలిగించే గొర్రెల పంపిణీ పథకాన్ని ఈనెల 28న పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జమ్మికుంట నుంచే ప్రారంభించనున్నారు. కొత్త రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమం కూడా ఈనెల 26 నుంచి రాష్ట్రంలో ప్రారంభం కాబో తోంది.

హుజూరాబాద్ కు వరాల జల్లు..
సంబంధిత మంత్రి గంగుల కమలాకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, అదే రోజు హుజూరాబాద్‌లో దరఖాస్తు చేసుకున్న వారందరికీ కార్డులు జారీ చేసినట్లు సమాచారం. హుజూరాబాద్ నియోజకవర్గంలో 46 వేల మంది ఎస్సీ ఓటర్లు ఉన్నట్లు లెక్క తేల్చారు. ఆ తరువాత అత్యధికంగా మున్నూరుకాపు ఓటర్లు 29 వేల వరకు ఉన్నట్లు అంచనా. ఇతర సామాజిక వర్గాల్లో పద్మశాలి (26 వేలు), గౌడ (24 వేలు), ముదిరాజ్ (23 వేలు), యాదవ (22 వేలు)తోపాటు రెడ్డి (22,600) సామాజిక వర్గాలకు కూడా గెలుపు, ఓటములను ప్రభావితం చేసే స్థాయి ఓటర్లున్నట్లు తెలుస్తోంది.

బీసీ అభ్యర్ధితో ఈటలకు చెక్..
వీరితోపాటు నాయీ బ్రాహ్మణ, ఎస్టీలు, రజక, మైనారిటీ తదితర వర్గాలకు చెందిన వారు 35 వేల వరకు ఉంటారని అంచనా. మున్నూరుకాపు, రజక సామాజిక వర్గాల ఆత్మగౌరవ భవనాలకు ఎకరా స్థలం, రూ.50 లక్షల నిధులు చొప్పున ఇప్పటికే ప్రొసీడింగ్స్ ఇచ్చారు. గౌడ సంఘానికి ఎకరా స్థలంతో పాటు కోటి రూపాయలు మంజూరు ఉత్తర్వులను అందజేశారు. అలాగే మహిళా ఆత్మగౌరవ భవనానికి కూడా ఎకరా స్థలం, రూ.కోటి మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. వీటితోపాటు గతంలో వైశ్య సామాజిక వర్గానికి భవనం కోసం ఎకరా స్థలాన్ని కేటాయించారు.

పార్టీ నేతలకు పదవులు-జాక్ పాట్ లు..
ఇప్పటికే కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇప్పటికే జిల్లాకు చెందిన సీనియర్ నేతలు ఎల్ రమణ.. పెద్దిరెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. ఇక, గెల్లు శ్రీనివాస్ నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లోనూ..అనేక మందితో వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నాయి. తాజాగా, కేసీఆర్ నిర్వహించిన సర్వేలోనూ అనుకూల ఫలితం వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే, ఈటల లేదా ఆయన సతీమణి జమున ఈ ఉప ఎన్నికల్లో పోటీకి దిగే అవకాశం ఉంది. ఈటల బరిలోకి దిగితే బీసీ అభ్యర్ధి సరైన ఎంపికగా భావిస్తున్నారు.
Recommended Video

ఈటల..జమునా పోటీలో ఎవరు- రంగంలో హరీష్..
అదే సమయంలో ఈటల సతీమణి పోటీలో ఉంటే... బీసీ వర్గం మద్దతు మరింతగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, నియోజకవర్గ ఉప ఎన్నిక బాధ్యత హరీష్ కు అప్పగిచటం..అదే సమయంలో కేసీఆర్ - హరీష్ వ్యూహాల గురించి పూర్తి అవగాహన ఉండటంతో ఈటల సైతం మరింత జాగ్రత్తగా అడుగులు ముందుకు వేసే అవకాశం ఉంది. ఇప్పుడు అధికార టీఆర్ఎస్ అభ్యర్ది ఖరారు కావటంతో.. ఇక, కాంగ్రెస్ తమ అభ్యర్ధి ఎవరనేది తేల్చాల్సి ఉంది. కేసీఆర్ నెల 16న హుజూరాబాద్ పర్యటనతో ఉప ఎన్నిక వేడి మరింత రాజుకొనే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications