ఇక టార్గెట్ కాంగ్రెస్: ‘ఆపరేషన్ ఆకర్ష్’పై కెసిఆర్ వ్యూహాత్మక అడుగులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్) ఆపరేషన్ ఆకర్ష్‌ను విజయవంతంగా కొనసాగిస్తోంది. తెలుగుదేశం పార్టీపై మొదట దృష్టిపెట్టిన టిఆర్ఎస్.. ఆ తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై కొనసాగించింది. టిఆర్ఎస్ పార్టీలో తెలుగుదేశం పార్టీ విలీనమైనట్లు ప్రకటించగా.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మరో ఎమ్మెల్యే గులాబీ గూటికి చేరున్నారు.
దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పూర్తిగా ఖాళీ అయినట్లేనని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్‌పై దృష్టి సారించింది. కాగా, మే 26న జరుగనున్న రాజ్యసభ ఎన్నికలలోగా కాంగ్రెస్ నుంచి ముగ్గురు, టిడిపి నుంచి ఒక్కరు టిఆర్ఎస్‌లో చేరేందుకు దాదాపు రంగం సిద్ధమైనట్టు పార్టీ వర్గాల సమాచారం.
టిఆర్ఎస్ సొంతంగా గెలుచుకున్న 63 స్థానాలకుతోడు టిడిపి, కాంగ్రెస్ నుంచి చేరికలతో రాష్ట్రం నుంచి ఖాళీకానున్న రెండు రాజ్యసభ స్థానాలూ ఆ పార్టీ గెలుచుకునేందుకు మార్గం సుగమమైంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ను పక్కనపెట్టి రెండో ప్రతిపక్షం టిడిపిని మొదట టిఆర్ఎస్ టార్గెట్ చేసింది. ఆ పార్టీ గెలుచుకున్న ఎమ్మెల్యేల్లో ముగ్గురు మినహా మిగతా అందరూ టిఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే చేరిపోయారు.

ఆ తర్వాత వైయస్సార్ కాంగ్రెస్‌ని టార్గెట్ చేసిన టిఆర్ఎస్.. ఆ పార్టీకి మిగిలిన ఒక ఎంపీ, ఎమ్మెల్యేను సైతం పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమైంది. దీంతో ఇక మరోసారి కాంగ్రెస్‌పై టిఆర్ఎస్ దృష్టి సారించింది. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు జరుగబోయే ఎన్నికలలోగా ఆపరేషన్ కాంగ్రెస్ దశను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు టిఆర్ఎస్ వర్గాల సమాచారం.
కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్ ఇటీవల టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. కాగా, టిఆర్ఎస్‌లో చేరడానికి సిద్ధంగావున్న ఎమ్మెల్యేలు అందరినీ ఒకేసారి పార్టీలో చేర్చుకోకుండా మధ్యమధ్యలో కొంత వ్యవధి ఉండేలా పార్టీ అధినేత కెసిఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాల చెబుతున్నాయి.
ఒకేసారి అందరినీ పార్టీలో చేర్చుకోవడం కంటే మధ్యలో కొంత గ్యాప్ ఇవ్వడం వల్ల ఇతర ప్రజా ప్రతినిధులపై మైండ్ గేమ్ ఆడొచ్చని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిఇలావుంటే కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్‌లో చేరడానికి ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒకరు నల్గొండ జిల్లాకు చెందినవారు కాగా, మిగిలిన ఇద్దరు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వారని టిఆర్ఎస్ వర్గాల విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
తెలుగుదేశం పార్టీలో మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, ఆర్ కృష్ణయ్య. అయితే, ఆర్ కృష్ణయ్య తెలుగుదేశం ఎమ్మెల్యేగా కంటే బీసీ సంఘం అధ్యక్షుడిగా కొనసాగడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా, ఖమ్మం జిల్లాకు చెందిన సండ్ర వెంకటవీరయ్యను కూడా టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది.
సండ్ర కూడా గులాబీ పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న సండ్రను కొంత కాలం తర్వాత పార్టీలో చేర్చుకోవాలని టిఆర్ఎస్ భావిస్తోంది. అయితే పాలేరు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి టిడిపి మద్దతు పలికిన నేపథ్యంలో ఇదే సరైన సమయంగా టిఆర్ఎస్ నాయకత్వం ముందుకు సాగే అవకాశం కూడా లేకపోలేదు.












Click it and Unblock the Notifications