టీఎస్ఆర్టీసీ వింత నిర్ణయం.. కోడిపుంజు వేలం
TSRTC: ఇంకొద్ది రోజుల్లో సంక్రాంతి పండగ రాబోతోంది. ఇప్పటి నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ సందడి కనిపిస్తోంది. మార్కెట్లల్లో పండగ కోలాహలం నెలకొంది. విక్రయాలు భారీగా పెరుగుతున్నాయి. పూలకు మంచి డిమాండ్ ఏర్పడింది. అన్ని రకాల పువ్వుల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థలు కూడా ప్రత్యేక బస్సులను నడిపించడానికి ఏర్పాట్లు చేస్తోన్నాయి. ఇప్పటికే టీఎస్ఆర్టీసీ 4,500 ప్రత్యేక స్పెషల్ సర్వీసులను నడిపిస్తామని వెల్లడించింది. అటు దక్షిణ మధ్య రైల్వే కూడా వివిధ నగరాల మధ్య 32 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకుని రానుంది.

ఈ పరిస్థితుల్లో టీఎస్ఆర్టీసీ అధికారులు ఓ వింత నిర్ణయాన్ని తీసుకున్నారు. ఓ కోడిపుంజును వేలం వేయబోతోన్నట్లు ప్రకటించారు. దీనికి ముహూర్తాన్ని కూడా పెట్టేశారు. వేదికనూ ఖరారు చేశారు. ప్రయాణికుడెవరో బస్సులో మరిచిపోయిన కోడిపుంజు అది. సంక్రాంతి పండగ బరిలో దించడానికి పెంచిన పందెంకోడి అది.
ఈ నెల 9వ తేదీన బస్సులో ఈ పందెంకోడిని సదరు ప్రయాణికుడు మరిచిపోయాడు. దీన్ని కరీంనగర్ ఆర్టీసీ అధికారులు భద్రం చేశారు. ఈ మూడు రోజుల పాటు దీన్ని తమ వద్దే పెంచుకున్నారు. ఇప్పటివరకూ ఎవరు కూడా ఆ పందెంకోడి తమదేనంటూ రాలేదు. దీనితో దీన్ని బహిరంగ వేలంలో విక్రయించాలని నిర్ణయించారు.
కరీంనగర్- 2 డిపో పరిధిలోని అంబేద్కర్ బస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ పందెంకోడిని వేలం వేయనున్నారు. ఆసక్తిగలవారు పాల్గొనవచ్చని విజ్ఙప్తి చేశారు. సంక్రాంతి పండగ కోసం పెంచిన కోడి కావడం వల్ల మంచి రేటుకు అమ్ముడుపోతుందనే అంచనాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications