సీనియర్ నేతను కాంగ్రెస్‌లోకి పంపుతున్న కేసీఆర్?
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నమ్మకస్తుల జాబితాలో తుమ్మల నాగేశ్వరరావు పేరు ఒకప్పుడు ప్రముఖంగా వినపడేది. ప్రస్తుతం తుమ్మల పేరు అట్టడుగుకు చేరింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాపై గట్టి పట్టున్న నాయకుడిగా గుర్తింపు పొందిన నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ తరఫున దాదాపు 30 సంవత్సరాలు రాజకీయం చేశారు. రాష్ట్ర విభజన అనంతర పరిణామాల్లో ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి గూటికి చేరారు.

ప్రత్యర్థి కూడా టీఆర్ఎస్ లో చేరడంతో..
టీఆర్ఎస్ లో చేరిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించడంతోపాటు మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో పాలేరు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఓటమిపాలైనప్పటికీ పార్టీకోసం తాను పనిచేస్తూనే ఉంటానని ప్రకటించారు. కాలక్రమంలో ఉపేందర్ రెడ్డికి మంత్రి కేటీఆర్ అండ దొరికింది. దీంతో కొన్నాళ్లకు టీఆర్ఎస్ లో చేరడంతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర కూడా చనువు పెరిగింది.

తుమ్మలను పట్టించుకోని కేసీఆర్
వాస్తవానికి అదే సమయంలో తుమ్మలకు నామినేటెడ్ పదవి ఇస్తారని ప్రచారం జరిగిందికానీ కేసీఆర్ ఆయన్ను పట్టించుకోలేదు. దీంతో తుమ్మల కొన్నాళ్లు ఇతర పనులు చూసుకున్నారు. అయితే మరోసారి రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటూ వార్తలు వస్తుండటంతో రాజకీయంగా చురుగ్గా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే సొంత పార్టీ నుంచి ఏవిధమైన స్పందన లేకపోవడంతో ఆయన కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. నియోజకవర్గమంతటా ఆయన పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ లో చేరేవిధంగా తన అనుచరులను కూడా సిద్ధం చేస్తున్నారు.

నన్ను నమ్ముకున్నవారందరికీ న్యాయం చేస్తా
తాను కాంగ్రెస్ పార్టీలో చేరినా తనను నమ్ముకున్నవారందరికీ న్యాయం చేస్తానని, వారు ఇతర పార్టీల్లో ఉన్నా తనకు ఎటువంటి పట్టింపులు లేవని స్పష్టం చేస్తున్నారు. దాదాపుగా ఆయన కాంగ్రెస్ లో చేరినట్లేనని, ఈసారి ఎట్టి పరిస్థితుల్లోను అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోన్న కాంగ్రెస్ కు బలమైన నేతగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావును చేర్చుకోవడంవల్ల ప్రయోజనం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.